Andhra Pradesh Ex Minister Narayana: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం నాడు ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీంతో మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్ , లింగమనేని రాజశేఖర్, రామకృష్ణా హౌసింగ్ డైరెక్టర్ అంజనీ కుమార్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read Also: Vijayawada: మరోసారి రోడ్డెక్కిన అగ్రిగోల్డ్ బాధితులు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్
ఇన్నర్ రింగ్ రోడ్డులో అలైన్‌మెంట్ మార్పు ద్వారా భూములు అమ్మి వందల కోట్లు సంపాదించారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా… ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరిగింది. ఈ కేసులో తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఈ కేసులో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నారాయణ, అంజనీకుమార్, లింగమనేని రమేష్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లను విచారించిన హైకోర్టు నారాయణ, అంజనీకుమార్‌లకు మాత్రమే మందుస్తు బెయిల్ మంజూరు చేసింది.