Site icon NTV Telugu

ఎయిడెడ్ స్కూళ్ళపై జగన్ వెనకడుగు..అందుకేనా?

ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్ధలను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు తీసుకున్న నిర్ణయం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి వైసీపీ సర్కార్ గతంలో ఆదేశాలు కూడా ఇచ్చింది. అంతటితో ఆగకుండా వాటిని ఎయిడెడ్ విద్యాసంస్ధల అభిప్రాయాలతో సంబంధం లేకుండా విలీనం చేసేందుకు విద్యాశాఖాధికారులకు రంగంలోకి దిగారు.

ఆ ఆదేశాలతో విద్యాశాఖాధికారులు తమ ప్రతాపం చూపడం మొదలెట్టారు. పురాతనమయిన, ఎంతో చరిత్ర కలిగిన విద్యాసంస్థల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. అధికారులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. ఎయిడెడ్ విద్యాసంస్ధలపై వేధింపులు మొదలయ్యాయి. విద్యాసంస్ధల్ని ప్రభుత్వానికి అప్పగిస్తారా లేక గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిలిపేయమంటారా అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఆందోళన పెరిగింది. వివిధ విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్ధులు రోడ్డెక్కారు. మాకు అమ్మఒడి వద్దు.. మా పాఠశాలే ముద్దు అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎయిడెడ్ విద్యాసంస్ధల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కోర్టు మెట్లెక్కారు.

ప్రభుత్వ హెచ్చరికలతో విద్యాసంస్ధలు నడపలేని పరిస్ధితి ఉందంటూ వారు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడంతో స్పందించింది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం. విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ ప్రభుత్వంపై సీరియస్ అయింది. ప్రభుత్వ న్యాయవాదిని ఏం జరుగుతోందంటూ ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ఏ నిబంధనల ప్రకారం ఎయిడెడ్ విద్యాసంస్ధల స్వాధీనం కోసం ఉత్తర్వులు జారీ చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో సర్కార్ ఇరుకునపడింది. ఓవైపు విలీనం చేయాల్సిందేనని జీవో ఇచ్చి, మరోవైపు స్వచ్ఛంద విలీనమని చెప్పడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తంచేసింది. విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడిని హైకోర్టుకు రప్పించి ఆయన వివరణ కోరింది. దీంతో ఆయన కూడా చివరికి ఎయిడెడ్ విద్యాసంస్ధల్ని స్వచ్చంధంగానే ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, ఈ మేరకు ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టుకు కీలక హామీ ఇవ్వాల్సి వచ్చింది.

ప్రభుత్వంలో విలీనానికి ఇప్పటికే అంగీకారం తెలిపిన ఎయిడెడ్‌ విద్యాసంస్థలు తిరిగి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. యథాతథంగా తమ విద్యాసంస్థలను నడుపుకోవచ్చు అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, రెచ్చగొట్టే ధోరణులు బాధాకరంగా వున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.తాము ప్రభుత్వంలో భాగమయ్యేలా చూడాలన్న ఎయిడెడ్‌ టీచర్ల వారి డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్నామన్నారు జగన్. ఎయిడెడ్‌ విద్యాసంస్థల యజమానులకు, అందులో పనిచేస్తున్న టీచర్లకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు జగన్.

Exit mobile version