Site icon NTV Telugu

Andhra Pradesh: టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు సెక్యూరిటీ తొలగింపు

Payyavula Keshav

Payyavula Keshav

అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పయ్యావులకు ప్రస్తుతం ఉన్న 1+1 భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పయ్యావుల గన్ మెన్‌లను వెనక్కు రావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. తనకు 2+2 కేటాయించాలంటూ ఇటీవల అధికారులను పయ్యావుల కోరగా ఇప్పుడు ఉన్న భద్రతనే తొలగించడం హాట్ టాపిక్‌గా మారింది. పెగాసస్‌పై పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం నిర్వహించిన తరువాతనే ప్రభుత్వం భద్రత తొలగించిందంటూ టీటీపీ ఆరోపిస్తోంది. అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పయ్యావుల ఆరోపించారని.. పయ్యావులకు సెక్యూరిటీ విత్ డ్రా చేసుకోవడం ద్వారా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందంటూ టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశంలో గన్ మెన్‌ల తొలగింపుపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాట్లాడే అవకాశాలు ఉన్నాయి.

Read Also: CPI Narayana: శాశ్వత అధ్యక్షుడిగా జగన్‌ నియామకం చట్టవిరుద్ధం

కాగా ఇటీవల పయ్యావుల కేశవ్ పెగాసస్ అంశంపై వైసీపీ సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెగాసస్ ఎక్విప్‌ మెంట్ చంద్రబాబు కొనలేదని గౌతమ్ సవాంగ్ ఆర్టీఐకి సమాధానం ఇచ్చారని.. కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతోప్రభుత్వం ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ తమ ఎమ్మెల్యేలు, మంత్రులపైనే నిఘా పెట్టిందని విమర్శలు చేశారు. విపక్షం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మొత్తం వైసీపీ నేతలతోనే పెగాసస్‌పై ఏర్పాటు చేసిన సభా సంఘానికి విలువ ఎక్కడుందని పయ్యావుల ప్రశ్నించారు. పెగాసస్ టీడీపీ దగ్గర ఉంటే జగన్ బాబాయ్ గొడ్డలి పోటు జరిగి ఉండేదా అని ఆయన నిలదీశారు.

Exit mobile version