Site icon NTV Telugu

Tirupati: రుయా ఆస్పత్రి ఘటనపై ప్రభుత్వం సీరియస్.. ఆర్ఎంవోపై వేటు

Tirupati Ruia Hospital

Tirupati Ruia Hospital

తిరుపతి రుయా ఆస్పత్రి వద్ద చోటుచేసుకున్న అంబులెన్స్ మాఫియా ఘటనను ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్‌ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.

కాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ఉన్న అంబులెన్స్ మాఫియా కేవలం 75 కిలో మీటర్ల అంబులెన్స్ ప్రయాణానికి ఏకంగా రూ.20వేలు డిమాండ్ చేసింది. దీంతో జయశివ అనే బాలుడి మృతదేహాన్ని తరలించడానికి భారీ స్థాయిలో నగదును డిమాండ్ చేసిన అంబులెన్స్ డ్రైవర్లు.. ప్రైవేట్ అంబులెన్స్‌ను ఆస్పత్రిలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో బైక్‌పైనే బాలుడి మృతదేహాన్ని తరలించారు. నిజానికి బాలుడి తండ్రి నర్సింహులు రోజువారి కూలీ. పొలం దగ్గర కాపలా కాస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈ నేపథ్యంలో రూ.20 వేలు తను భరించలేనని అంబులెన్స్ డ్రైవర్లను వేడుకున్నా వారు కనికరించలేదు.

మరోవైపు ఈ ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుప‌తి రుయా ఆస్పత్రి ఘ‌ట‌న‌పై సూప‌రింటెండెంట్ డాక్టర్ భారతి వివ‌ర‌ణ కోరినట్లు పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు జరగడం దుర‌దృష్టక‌రమని, అంబులెన్సు మాఫియాను వ‌దిలిపెట్టే ప్రస‌క్తే లేదని మంత్రి రజిని హెచ్చరించారు. మృత‌దేహాల విష‌యంలో వ్యాపారం చేసే దోషుల‌ను క‌ఠినంగా శిక్షిస్తామని మంత్రి రజినీ పేర్కొన్నారు.

Tirupati Ruia Hospital: రుయాలో అమానవీయఘటన… అంబులెన్స్ దందా

Exit mobile version