NTV Telugu Site icon

AP Government: పరిశ్రమలకు గుడ్‌న్యూస్‌.. పవర్ హాలిడే ఎత్తివేత..

Peddireddy

Peddireddy

అధిక ఉష్ణోగ్రతలతో విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది.. డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో కోతలు తప్పలేదు.. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ప్రకటిస్తూ ఏపీ సర్కార్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే, మళ్లీ విద్యుత్‌ డిమాండ్‌ తగ్గడంతో.. పరిశ్రమలకు పవర్ హాలిడే ఎత్తివేసింది ప్రభుత్వం.. పరిశ్రమలకు విద్యుత్ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గిందని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 186 మిలియన్ యూనిట్ల వినియోగం మాత్రమే ఉందని.. దీంతో, పరిశ్రమలకు విధించిన పవర్ హాలిడేను ఉపసంహరిస్తున్నామని వెల్లడించారు.

Read Also: Narayana Arrest: అందుకే నారాయణ అరెస్ట్.. పోలీసుల ప్రకటన

పరిశ్రమలు వినియోగించాల్సిన విద్యుత్ ను కూడా 70 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి.. ఆహారశుద్ధి, కోల్డ్ స్టోరేజి, ఆక్వా పరిశ్రమలకు 100 శాతం విద్యుత్ వినియోగానికి అనుమతి ఇస్తున్నామని.. ప్రస్తుతం ఏపీ అవసరాల కోసం 10 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇంకా విద్యుత్ కొరత ఉందన్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తామని.. ఆరు నెలల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు ద్వారా ఏడాదిలో 33 శాతం మేర విద్యుత్ ఆదా అయ్యిందన్న మంత్రి పెద్దిరెడ్డి.. ఆ మేరకు డిస్కమ్ లు తీసుకునే సబ్సిడీ తగ్గిందని.. ప్రస్తుతం ఏపీలో వ్యవసాయ సబ్సిడీగా 10 వేల కోట్లు ఇస్తున్నామని గుర్తుచేశారు.