NTV Telugu Site icon

మా డిమాండ్‌ పీఆర్సీ ఒక్కటే కాదు.. ఉద్యమం కొనసాగుతుంది..!

PRC

ఓ వైపు ఇప్పటికే పీఆర్సీ ప్రిక్రియ పూర్తి అయ్యింది.. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెబుతుంటే.. తమ ఆందోళన మాత్రం ఆపేదిలేదని స్పష్టం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు… మాకు పీఆర్సీ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదన్న నేతలు… పది రోజుల్లో పీఆర్సీ ప్రక్రియ పూర్తి చేస్తాం అని సీఎం చెప్పినట్లు మీడియాలో చూశామని.. ముఖ్యమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నామని వెల్లడించారు..

Read Also: పీఆర్సీపై గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్

అయితే, పీఆర్సీ నివేదిక పై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ప్రకటించటం సంప్రదాయం అని గుర్తుచేశారు ఉద్యోగ సంఘాల నేతలు.. నివేదికలో ఫిట్ మెంట్ దగ్గర నుంచి చాలా అంశాలు ఉంటాయని.. మా డిమాండ్లలో పీఆర్సీ ఒక్కటే లేదని.. ఇంకా 55 డిమాండ్లు ఉన్నాయని తెలిపారు.. మిగిలిన డిమాండ్ల పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనంత వరకు మా పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే తమ డిమాండ్లపై సీఎస్‌ను కలిసి సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు.. ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ పెట్టిన సంగతి విదితమే.