Andhra Pradesh: ఈనెల 31న వినాయకచవితి పండగ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా వినాయకుడి మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేయాలంటే అధికారులు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని వివరణ ఇచ్చారు. వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసేందుకు స్థానిక పోలీస్, రెవెన్యూ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు. చట్టపరంగా తీసుకోవాలసిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలన్నారు.
Read Also: Noida Twin Towers Demolition: పేకమేడల్లా కూలిన ట్విన్ టవర్స్
అది మినహాయించి ఏ రకమైన రుసుము లేదా చందాలు వసూలు చేసినా లేదా ప్రేరేపించబడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ హెచ్చరించారు. రుసుము వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్రచారం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు భక్తులు నమ్మవద్దని.. వినాయక చవితి పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అన్నారు. ఎక్కడైనా మండపాలకు రుసుము వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హరి జవహర్ లాల్ స్పష్టం చేశారు.
కాగా కర్నూలు జిల్లా దేవనకొండలో వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దేవనకొండలో గతంలో నిర్వహించిన మొహరం వేడుక కొందరు అల్లర్లు సృష్టించారని.. దీంతో వినాయక చవితి వేడుకలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.
