AP EAPCET 2022 results are out: ఏపీలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్-2022 ఫలితాలను విజయవాడలోని లెమన్ ట్రీ హోటల్‌లో మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను జులై 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 3,84,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు 3.01 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 2.82 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షను 1.94లక్షల మంది, అగ్రికల్చర్ పరీక్షను 87 వేల మంది విద్యార్థులు రాశారు. ఇంజినీరింగ్‌లో 89.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. అగ్రికల్చర్ విభాగంలో 95.06 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు.
Read Also: Mahendra Singh Dhoni: ధోనీకి షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు
ఇంజనీరింగ్‌లో టాప్‌టెన్‌లో ఒక్కస్థానంలో కూడా అమ్మాయిలు చోటు దక్కించుకోలేకపోయారు. అటు టాప్ టెన్‌లో తెలంగాణ విద్యార్థులు నాలుగు స్థానాలు దక్కించుకున్నారు. మొదటి ర్యాంకర్‌గా శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బోయ హరేన్ సాత్విక్ నిలిచాడు. అతడికి 160 మార్కులకు గాను 158.62 మార్కులు వచ్చాయి. డో ర్యాంకర్‌గా ఒంగోలు జిల్లాకు చెందిన లక్ష్మీ సాయి లోహిత్ రెడ్డి నిలిచాడు. అతడికి 158.55 మార్కులు వచ్చాయి. మూడో ర్యాంకర్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన హిమ వంశీ (157.93 మార్కులు) నిలిచాడు. అటు అగ్రికల్చర్ విభాగంలో మొదటి ర్యాంకర్‌గా గుంటూరు జిల్లాకు చెందిన దినేష్ కార్తిక్ రెడ్డి నిలిచాడు.
కాగా త్వరలోనే అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రి బొత్స తెలిపారు. మొత్తం స్థానాల్లో 70 శాతం కన్వీనర్ కోటా, 30 శాతం మేనేజ్మెంట్ కోటాఉంటుందన్నారు. గత ఏడాది 15 శాతం ఎన్ఆర్ఐ కోటా ఉండేదని.. మిగిలిన 15 శాతం కన్వీనర్ కోటా ఉండేదని.. వీటిపై న్యాయపరమైన చిక్కులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వం ఒక విధానం తీసుకుంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న మొత్తం ఇంజనీరింగ్ సీట్లు 1,48,243 అని పేర్కొన్నారు. టాపర్స్‌కు, ఉత్తీర్ణులైన విద్యార్థులు అందరికీ మంత్రి బొత్స అభినందనలు తెలియజేశారు. ప్రైవేటు కాలేజీల్లో 35 శాతం సీట్లు జగనన్న విద్యా దీవెన కింద కేటాయింపు ఉంటుందని స్పష్టం చేశారు.
