ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్తున్నారు… రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి బయల్దేరనున్న ఆయన.. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.. ఇక, రాత్రి 9 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం కానున్నారు.. డిసెంబర్ లోగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని.. ఇప్పటికే చాలాసార్లు చెప్పిన ఏపీ సీఎం జగన్.. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంపై దృష్టిపెట్టారు. ఈ అంశంలో సహకారం కోరేందుకు.. హోమ్ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. పోలవరం నిధులను త్వరగా విడుదల చేయాలని కోరనున్నారు. విభజన హామీలు, పెండింగ్ బకాయిల తదితర అంశాలపైనా హోమ్ మంత్రితో చర్చించనున్నారు జగన్. రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ సహా ఇతర విషయాలపైనా చర్చించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, గజేంద్ర సింగ్ షెకావత్ లతో కూడా భేటీ కానున్నారు ఏపీ సీఎం.. పోలవరం ప్రాజెక్టు కు నిధులు, నిర్మాణం కొనసాగుతున్న తీరుతెన్నుల పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించనున్న ఆయన.. కేంద్ర పర్యావరణ శాఖ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ తో పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై చర్చిస్తారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకానికి సహకారం అందించాలంటూ.. 2 రోజుల కిందట ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం జగన్. కేంద్ర పథకం-ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో కలిపి.. రాష్ట్ర వ్యాప్తంగా 17వేలకు పైగా గ్రీన్ ఫీల్డ్ కాలనీలను అభివృద్ధి చేస్తుండగా… మౌలిక సదుపాయాల కోసం ఆర్ధిక సహకారం అందించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అమిత్ షాతో జగన్ భేటీ సమయంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. షాతో పాటు పలువురు ఇతర కేంద్ర మంత్రులతోనూ సీఎం భేటీ అవుతారని సమాచారం. అటు రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఇక, రేపు రాత్రికి హస్తినలోనే బస చేయనున్నారు.. ఎల్లుండి ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి చేరుకోనున్నారు.