Site icon NTV Telugu

YSRCP BC leaders : బీసీ మంత్రులు, నేతల కీలక భేటీ.. విషయం ఇదేనా..?

Ysrcp Bc Leaders

Ysrcp Bc Leaders

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే ఎన్నికల ఫీవర్‌ మొదలైంది.. సాధారణ ఎన్నికలకు ఇంకా దాదాపు 16 నెలల సమయం ఉన్నా.. అన్ని పార్టీలు.. ఎన్నికలే లక్ష్యంగా తమ పని మొదలు పెట్టాయి.. మొన్నటికి మొన్న పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గతంలో పని విధానాన్ని మార్చుకోవాలంటూ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు.. అయినా పని విధానాన్ని మెరెగుపర్చుకోనివారికి షాక్‌ ఇచ్చారు. ఈ సారి, వైసీపీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లతో పాటు.. పలు జిల్లాల అధ్యక్షులను కూడా మార్చేశారు.. సీనియర్లు, మాజీ మంత్రులను కూడా పక్కనబెట్టి.. కొత్తవారికి అవకాశం కల్పించారు.. మాజీ మంత్రులకు సైతం షాకిచ్చిన ఆయన.. పని చేయకపోతే ఎవ్వరినీ వదిలేది లేదు అనే సంకేతాలను ఇచ్చారు.. ఇక, ఇవాళ వైసీపీ బీసీ మంత్రులు, నేతలు కీలక భేటీ జరగబోతోంది.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగబోతోంది.

Read Also: New Police Posts: పోలీసు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్‌న్యూస్‌..!

ఈ సమావేశానికి 9 మంది కీలక నేతలు హాజరుకాబోతున్నారు.. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే పార్ధ సారధి, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి.. బీసీ నేతల సమావేశంలో పాల్గొనబోతున్నారు.. వచ్చే ఎన్నికల్లో బీసీ వర్గాలను కన్సాలిడేట్ చేసుకోవటం, ఈ వర్గాలకు ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళటం, రాష్ట్ర స్థాయి సదస్సులు వంటి అంశాలపై చర్చించనున్నారు నేతలు.. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనూ భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.. ఇప్పటికే వరుసగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్న సీఎం జగన్‌.. ఆ నియోజకవర్గానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేకూరిన లబ్ధి, చేసిన ఖర్చు వివరాలను తెలియజేస్తూనే.. కలిసికట్టుగా ముందుకు సాగాలని చెబుతూ వస్తున్నారు.. ఈ ఎన్నికల్లో 175కి 175 స్థానాల్లో విజయం సాధించాలన్న లక్ష్యం పెట్టుకున్న వైసీపీ అధినేత.. దాని కోసం అన్ని వర్గాల నుంచి కేంద్రీకరించి పనిచేయించే పనిలో పడిపోయారు. అందులో భాగంగానే.. బీసీ సామాజికవర్గంపై ఆయన ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టారు.. ఇప్పటికే బీసీలకు మంత్రిపదవులు, ఇతర పోస్టులకు కట్టబెట్టిన ఆయన.. బీసీ సామాజిక వర్గానికి తాము ఏం చేశామన్నది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. అయితే, ఇవాళ జరగనున్న సమావేశంలో ఎలాంటి కార్యాచరణ రూపొందిస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version