NTV Telugu Site icon

క‌రోనాపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌.. థ‌ర్డ్‌వేవ్, హెల్త్‌హ‌బ్స్‌‌పై కీల‌క సూచ‌న‌లు

YS Jagan

రాష్ట్రంలో ప్ర‌స్తుతం కోవిడ్‌ పరిస్థితులు, కోవిడ్‌ థర్డ్‌వేవ్‌ సన్నద్ధత, హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటుపై స‌మీక్ష నిర్వ‌హించిన సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి.. ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.. శిశువులు, చిన్నారులకు ఆక్సిజన్, ఐసీయూ బెడ్ల పెంపుదలపై కార్యాచరణ ప్రణాళికను సీఎంకు వివ‌రించారు అధికారులు.. ఐసీయూ బెడ్లు ఇప్పుడు ఉన్నవాటితో కలిపి మొత్తంగా 1600 ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేశామ‌న్నారు.. ఆక్సిజన్‌ బెడ్లు ఇప్పుడున్న వాటితో కలిపి 3,777 ఏర్పాటుపై చర్యలు తీసుకుంటున్న‌ట్టు వివ‌రించారు.. అలాగే అదనంగా చిన్నపిల్లల వైద్యులు, స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని తీసుకునేలా ప్రణాళిక వేశామ‌న్నారు.. అయితే, నెలరోజుల్లోగా ఈ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు సీఎం వైఎస్ జ‌గ‌న్..

పీడియాట్రిక్‌ అంశాలల్లో నర్సులకు, సిబ్బందికి చక్కటి శిక్షణ ఇవ్వాల‌న్నారు సీఎం జ‌గ‌న్.. ఇక‌, కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా పిల్లల్లో అనారోగ్య సమస్యలు వస్తున్నాయన్న అధికారులు.. ఊపిరిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలు వ‌స్తున్న‌ట్టు తెలిపారు.. వీరికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.. ఆరోగ్య శ్రీ చికిత్సల కింద ప్రభుత్వం నిర్దారిస్తున్న రేట్లు వారిని ఇబ్బందులకు గురిచేసే రేట్లు కాకుండా, వాస్తవిక దృక్పథంతో ఆలోచించి రేట్లు ఫిక్స్ చేయాల‌ని సూచించారు. దేశంలో అత్యుత్తమ ఆరోగ్య పథకంగా ఆరోగ్యశ్రీ నిలవాలన్న ఆయ‌న‌.. జిల్లాలో హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు విషయంలో కొన్ని సూచనలు చేశారు.. జనావాసాలకు దగ్గరగా ఉండేలా చర్యలు తీసుకోవాల‌న్న సీఎం.. నగరాలు, పట్టణాలకు నలువైపులా ఆస్పత్రులు తీసుకురావాల‌న్నారు.. దీనివల్ల ప్రజలకు చేరువలో ఆస్పత్రులు ఉంటాయ‌న్నారు.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో పెద్ద ఆస్పత్రుల్లో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలు, టెక్నాలజీ, సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలన్నదే హెల్త్‌ హబ్స్‌ వెనుక ప్రధాన ఉద్దేశమని స్పష్టంచేసిన ఏపీ సీఎం.. ఉత్తమ వైద్యసేవల విషయంలో ఒక జిల్లాలో పరిస్థితి మెరుగుపడడానికి సంబంధిత హెల్త్‌హబ్‌కింద ఈ ఆస్పత్రులు తీసుకురావాల‌న్నారు. వైద్యసేవలను అందించే విషయంలో జిల్లాలు ఈ హెల్త్‌ హబ్‌లద్వారా స్వయం సమృద్ధి సాధించాల‌న్నారు. సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, అత్యుత్తమ వైద్య విధానాలు ప్రతి జిల్లాకూ అందుబాటులోకి రావాల‌ని.. 2 వారాల్లోగా హెల్త్‌ హబ్‌పై విధివిధానాలు ఖరారు కావాల‌ని ఆదేశించారు సీఎం వైఎస్ జ‌గ‌న్.