NTV Telugu Site icon

YSR Kapu Nestham: కాపులకు సీఎం జగన్‌ గుడ్‌న్యూస్‌.. రేపే నిధులు విడుదల..

Ysr Kapu Nestham

Ysr Kapu Nestham

కాపులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. రేపు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పర్యటించనున్న ఆయన.. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం మూడో విడత సహాయం నిధులను బటన్‌ నొక్కి విడుదల చేయనున్నారు.. దీనికోసం, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రేపు జరగనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సర్వసిద్దం చేశారు అధికారులు.. కాపునేస్తం మూడవ విడత నిధులు విడుదలకు గొల్లప్రోలు వేదికగా మారింది.. మూడవ విడత కాపునేస్తo నిధులు ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో నేరుగా జమచేయనున్నారు.. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న సీఎం 10.30 గంటలకు గొల్లప్రోలు చేరుకుంటారు.. ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు సీఎం బహిరంగ సభలో పాల్గొంటారు.. అనంతరం వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం సహాయం విడుదల చేస్తారు.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం.

ఇక, సీఎం వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు కన్నబాబు, స్థానిక ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఎంపీ గితావిశ్వనాథ్‌లు అధికారులతో కలసి ఏర్పాట్లు పర్యవేక్షించారు.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.. వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దారిపొడవునా ఫ్లెక్సీలతో ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. గొల్లప్రోలు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలోని హెలిపాడ్ వద్ద దిగి రోడ్డు మార్గంలో పట్టణ శివారులోని ఈబీసీ కాలనీ సమీపంలో గల ప్రవేటు లేఅవుట్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఇప్పటికే హెలిపాడ్, సభావేదికలు సిద్ధం చేసి, సీఎం వెళ్లేందుకు వీలుగా ప్రత్యేకoగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. సాయంత్రం సీఎం ప్రయాణించే బస్సు, హెలికాప్టర్, కాన్వాయ్ ట్రైల్ రన్ కూడా నిర్వహించారు అధికారులు.

కాపునేస్తం పథకం ద్వారా కాపు సామాజికవర్గానికి చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపున్న మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేల చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. ఏటా సగటున 3.2లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. కాపు నేస్తం కోసం ప్రభుత్వం సుమారు రూ.490 కోట్ల రూపాయాలు వెచ్చిస్తోంది.. కాపు సామాజిక వర్గానికి చెందిన ఉప కులాలైన కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల్లోని లబ్ధిదారులకు ఈ పథకం వర్తింపజేస్తున్నారు.. అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి రూ.15 వేల ఆర్దిక సహాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. మొత్తం ఐదేళ్ల పాలనలో రూ.75 వేల ఆర్దిక సహాయాన్ని అందిస్తోంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.