CM Jagan Mohan Reddy: ఏపీ సీఎం జగన్ వరుసగా రెండోరోజు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. ముంపు ప్రాంతాల సమస్యలు విని, పరిష్కరించేందుకే తాను వచ్చానని సీఎం జగన్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చాకే ప్రాజెక్టులో నీళ్లు నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. పరిహారం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నానని తెలిపారు. రూ.వెయ్యి, రెండు వేల కోట్లు అయితే తాను భరించేవాడిని అని.. కానీ రూ.20 వేల కోట్లు కావాలని,,. అందుకే ప్రతిసారీ కేంద్రాన్ని అడుగుతున్నామని పేర్కొన్నారు. కేంద్రం పరిహారం ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తానే ఇస్తానని.. పోలవరం నిర్వాసితులకు ఇళ్లు త్వరగా కట్టిస్తానని జగన్ హామీ ఇచ్చారు.
Read Also: Srikakulam YCP Politics : శ్రీకాకుళం వైసీపీలో వాడీ వేడిగా గ్రూపు రాజకీయాలు
ఎవరికి ఎలాంటి వరద నష్టం జరిగినా గ్రామ సచివాలయంలో లిస్ట్‌లో ఉంటుందని సీఎం జగన్ అన్నారు. వరద నష్టం వివరాలు ఏమైనా ఉంటే పేరు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన గుర్తుచేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని జగన్ స్పష్టం చేశారు. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ.5 వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్‌లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని జగన్ తెలిపారు. వరద బాధితులకు పారదర్శకంగా పరిహారం అందించామని.. అందరికీ రేషన్, ఇంటింటికీ రూ. 2 వేలు అందించామని వివరించారు. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చామని సీఎం జగన్ చెప్పారు.
