Site icon NTV Telugu

CM Jagan Mohan Reddy: ఆదాయం సమకూరుస్తున్న శాఖలపై సీఎం జగన్‌ సమీక్ష

Cm Jagan (1)

Cm Jagan (1)

ఏపీలో ఖజానాకు ఆదాయం సమకూర్చిపెట్టే శాఖలపై ఫోకస్ పెట్టారు సీఎం జగన్. ఆదాయాల పరంగా వివిధ శాఖలు, వాటి లక్ష్యాలను సమీక్షించారు సీఎం. రాష్ట్రంలో మద్యం వినియోగం బాగా తగ్గిందని తెలిపారు అధికారులు. 2018–19లో లిక్కర్‌ అమ్మకాలు 384.31లక్షల కేసులు కాగా, 2021–22లో 278.5 లక్షలకు తగ్గిందని తెలిపారు. 2018–19లో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసులు కాగా, 2021–22లో 82.6 లక్షల కేసులకు తగ్గిందన్నారు. 2018–19లో మద్యం విక్రయాలపై ఆదాయం రూ.20,128 కోట్లు కాగా, 2021–22లో మద్యం విక్రయయాలపై ఆదాయం రూ. 25,023 కోట్లుగా పేర్కొన్నారు అధికారులు.

రేట్లు షాక్‌ కొట్టేలా పెట్టడంతో మద్యం వినియోగం గణనీయంగా తగ్గిందన్నారు సీఎం. బెల్టు షాపులు ఎత్తివేయడం, ధరలు విపరీతంగా పెంచడంతో వినియోగాన్ని బాగా నియంత్రించామన్నారు సీఎం. లీకేజీలు లేకుండా, పారదర్శక విధానాలు అమలు చేయాలని సంబంధిత శాఖలకు సీఎం ఆదేశాలిచ్చారు. గడచిన ఆరు నెలల్లో అక్రమ మద్యం తయారీ, రవాణా, గంజాయిలకు సంబంధించి మొత్తంగా 20,127 కేసులు నమోదు చేశామని తెలిపారు అధికారులు. ఇందులో 16,027 మందిని అరెస్టు చేయగా, 1,407 వాహనాలు సీజ్‌ చేశామన్నారు అధికారులు. నాటుసారా తయారీయే వృత్తిగా ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు అధికారులు.

నాటుసారా తయారీలో ఉన్న వారిని దాని నుంచి బయటపడేయాలని సీఎం ఆదేశించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం. స్వయం ఉపాధి పెంచి, వారికి గౌరవ ప్రదమైన ఆదాయాలు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. మాదక ద్రవ్యాలు, గంజాయి లాంటి వాటికి విద్యార్థులు, యువత లోనుకాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ప్రతి కాలేజీ, యూనివర్శిటీల ముందు ఎస్‌ఈబీ నంబర్‌ను డిస్‌ప్లే చేయాలని సీఎం ఆదేశించారు. ఎస్‌ఈబీ నంబర్‌తో బోర్డులు పెట్టాలన్న సీఎం…ఎక్కడా కూడా మాదక ద్రవ్యాలకు సంబంధించి వ్యవహారాలు ఉండకూడదని ఆదేశించారు.

గంజాయి సాగును నివారించేందుకు ప్రణాళికా బద్ధంగా ముందకు సాగాలన్నారు. మంచి పంటలను సాగుచేయడానికి అవసరమైన విత్తనాలు, ఇతర సహాయ సహకారాలు వారికి అందించాలన్నారు. దీంతోపాటు క్రమం తప్పకుండా గంజాయిసాగుపై దాడులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికే వివిధ పంటలకు సంబంధించి విత్తనాలు అందించామన్నారు అధికారులు. గంజాయిని వదిలేసి వివిధ పంటలు సాగుచేస్తున్న వారికి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చి, వారికి రైతు భరోసా వర్తింపు చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు.

ఏసీబీకి సంబంధించిన 14400 నంబర్‌ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్దా కనిపించాలని సీఎం ఆదేశించారు. దీనికోసం కచ్చితంగా బోర్డులు పెట్టాలన్నారు సీఎం. సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసులకు కొత్తరూపు ఇవ్వాలని, పాస్‌పోర్టు ఆఫీసుల తరహాలో వీటిని తీర్చిదిద్దాలన్నారు. అలాగే, మైనింగ్‌కు సంబంధించి అన్నిరకాల అనుమతులు పొంది, లైసెన్స్‌లు తీసుకున్న వారు ఆ గనులను నిర్వహిస్తున్నారా? లేదా? అన్నది పరిశీలన చేయాలన్నారు. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని కలెక్టర్‌తో కలిసి లైసెన్స్‌లు పొందిన చోట ఆపరేషన్స్‌లో ఉండేలా చూడాలన్నారు. ఒకవేళ ఆపరేషన్స్‌లో లేకపోతే కారణాలు కనుక్కొని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రచందనం విక్రయంలో అత్యంత పారదర్శక విధానాలు పాటించాలని, గ్రేడింగ్‌లో థర్డ్‌పార్టీచేత కూడా పరిశీలన చేయించాలన్నారు సీఎం.

ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖమంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్, సీఎస్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌ రెడ్డి, అడిషనల్‌ డీజీ ఎ రవిశంకర్, అటవీ పర్యావరణశాఖ స్పెషల్‌ సీఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్స్‌ అండ్‌ స్టాంప్స్‌ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి గుల్జార్, ఏపీసీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read Also:Progress Report: ఆగస్ట్ మాసం ‘కార్తికేయ-2’దే!

Exit mobile version