NTV Telugu Site icon

CM Jagan Mohan Reddy: ప్రభుత్వ పాఠశాలలో ప్రతి క్లాసులో డిజిటల్ బోధన

Jagan Review Meeting

Jagan Review Meeting

CM Jagan Review Meeting On Education Department: అమరావతిలో సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై శుక్రవారం నాడు అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి క్లాసులో డిజిటల్ బోధన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇంటరాక్టివ్‌ డిస్‌ప్లే లేదా ప్రొజెక్టర్లతో ప్రభుత్వ బడిపిల్లలకు మరింత విజ్ఞానం పెరుగుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. నాడు-నేడు రెండో దశ కింద 22,344 స్కూళ్లలో చేపడుతున్న పనుల ప్రగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. విద్యావ్యవస్థలో చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి డేటా నిరంతరం అప్‌లోడ్ అయ్యేలా చూడాలని జగన్ పేర్కొన్నారు.

Read Also:2022లో ఇండియాలో టాప్ సెల్లింగ్ కార్లు

మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీల భర్తీపైనా సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. డీఈవో, ఎంఈవో సహా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణ బాధ్యతలున్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ తెలిపారు. ఎస్‌సీఈఆర్టీ, డైట్‌ సీనియర్‌ లెక్చరర్స్, డైట్‌ లెక్చరర్స్‌ పోస్టుల భర్తీ పైనా దృష్టి పెట్టాలని సూచించారు. రెండో దశ నాడు–నేడు పనులను వేగవంతం చేయాలన్నారు. స్కూళ్లలో విలువైన ఉపకరణాలను ఏర్పాటు చేస్తున్నందున భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలన్నారు. టాయిలెట్ మెయింటెనెన్స్, స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పీపీ –1 నుంచి రెండో తరగతి వరకూ స్మార్ట్‌ టీవీలు, 3వ తరగతి ఆపైన ప్రొజెక్టర్లు పెట్టేలా ఆలోచన చేయాలని జగన్ పేర్కొన్నారు.