Site icon NTV Telugu

CM Jagan: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది..!!

Cm Jagan

Cm Jagan

CM Jagan: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు ప్రజలు తేడా గమనించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందని చెప్పారు.

చంద్రబాబు హయంలో 2014లో 238 మండలాలు, 2015లో 359 కరవు మండలాలు, 2016లో 301 కరవు మండలాలు, 2017లో 121 కరవు మండలాలు, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో 257 కరవు మండలాలు ఉన్నాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. దేవుడి దయతో గత మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. రాష్ట్రంలో 13.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో అనంత, సత్యసాయి జిల్లాతో సహా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు పెరిగాయని, కరువన్నదే లేదని జగన్ తెలిపారు.

Read Also: ప్రపంచంలో ప్రమాదకరమైన కుక్కల జాతులు

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రతి అంశంలో తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉందన్నారు. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉందని.. రైతన్నల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నామని సీఎం జగన్ తెలిపారు. మూడు విడతల్లో ప్రతి ఏడాది రైతుకు రూ.13,500 సాయం అందిస్తున్నామన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు చేసే పనులను ప్రజలు గమనించాలని జగన్ కోరారు.

Exit mobile version