ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో జగన్ సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీకి రుణపరిమితులు, పెండింగ్ బిల్లులు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్ర విభజన సమస్యలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత వంటి అంశాలను జగన్ చర్చించారు. ప్రధానితో భేటీ గంటకు పైగా జరిగింది.
అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. ఏపీకి ఇవ్వాల్సిన నిధులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు. రెవెన్యూ భర్తీ కోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉందని, పెండింగ్ బిల్లుల రూపంలో, 10వ వేతన సంఘం సిఫార్సుల అమలు కార్యక్రమాలకు ఖర్చుచేసిన రూ.32,625.25 కోట్లను భర్తీచేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సకాలంలో నిధులు, సవరించిన అంచనాలకు ఆమోదం వంటి తదితర అంశాలపైనా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం జగన్ చర్చించారు.
అనంతరం కేంద్ర జలశక్తిశాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో సీఎం సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురి మధ్య ప్రధాన చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టు పనులను సత్వరంగా పూర్తయ్యేలా తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎంవిజ్ఞప్తి చేశారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిరరించిన అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులను పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. వరద కారణంగా దెబ్బతిన్న ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాం పునాదులకు సంబంధించి ఈ సమావేశంలోకూడా చర్చ జరిగింది. దిగువ కాఫర్ డ్యాంకు సంబంధించి ఇప్పటికే డిజైన్లు ఖరారుచేసిన అంశాన్ని కేంద్రమంత్రి ప్రస్తావించారు. ఎర్త్ కం రాక్‌ఫిల్ డ్యాంకు సంబంధించి డయాఫ్రం వాల్ ఎలా పటిష్టంచేయాలి? లేదా కొత్తగా నిర్మించాలా? అనే అంశాలపై వరుసగా నిపుణులతో చర్చలు జరుపుతున్నామని, ఇవికూడా వారం లేదా పదిరోజుల్లో ఖరారు అవుతాయని సీఎంకు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని సీఎం జగన్ కోరారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.