CM Jagan: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో గెలవాలని వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. ఈనెల 22న కుప్పంలో పర్యటించి రూ.66 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు సీఎం జగన్ కుప్పం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా సీఎం జగన్ కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా భారీ జనసమీకరణ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు స్వయంగా సీఎం జగన్ పర్యటిస్తుండటంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీకి ఆస్కారం లభించే అవకాశముంది.
కాగా సీఎం జగన్ పాల్గొనే అధికారిక పర్యటనలో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు సమాచారం ఇవ్వనున్నారు. సీఎం జగన్ పాల్గొనే కార్యక్రమాలకు చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదు. అయితే 2024లో జరిగే కుప్పం ఎన్నికలను ఇరుపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జగన్‌కు పోటీగా అదే సమయంలో చంద్రబాబు కూడా పర్యటిస్తారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ఇటీవల కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో రభస చోటు చేసుకుంది. వైసీపీ నేతలు అన్నా క్యాంటీన్‌ను ధ్వంసం చేశారంటూ చంద్రబాబు రోడ్డుపై కూర్చుని నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఏదేమైనా సీఎం జగన్ కుప్పం పర్యటన రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుండగా టీడీపీలో మాత్రం గుబులు రేపుతోంది.
