Andhra Pradesh: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్ అంశం బుధవారం కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై కొంత స్పష్టతకు ప్రభుత్వం వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం నాడు సీపీఎస్ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సీపీఎస్ ఉద్యోగ సంఘాలతో పాటు మిగిలిన అన్ని జేఏసీలతో జీవోఎమ్ భేటీ కానుంది. జీపీఎస్‌లో మరింత మెరుగైన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాల నేతలకు వివరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉద్యోగులు కోరుతున్న ఓపీఎస్ సాధ్యం కాదనే సంకేతాలను ప్రభుత్వ వర్గాలు ఇస్తున్నాయి.
Read Also: Gorantla Madhav: అశ్లీల వీడియోపై సీఐడీకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఎంపీ
జీపీఎస్ మీద తమను చర్చలకు పిలవొద్దని ప్రభుత్వానికి స్పష్టం చేశామని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత మరియా దాస్ వెల్లడించారు. ఓపీఎస్‌పై చర్చ అయితేనే వస్తామని చెప్పామని.. పాత పెన్షన్ విధానం మినహా మరే ఇతర ప్రత్యామ్నాయాలను తాము అంగీకరించేది లేదన్నారు. తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మంత్రి బొత్సకు విజ్ఞప్తి చేశామన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కూడా కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. అటు సీపీఎస్ యూఎస్ నేత రవి కుమార్ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ జీపీఎస్‌ను అంగీకరించేది లేదన్నారు. తమకు సంబంధం లేకుండానే జీపీఎస్‌ను అమలు చేస్తామన్న తీరులో ప్రభుత్వ నేతలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం ఇదే వైఖరిని అమలు చేస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రవికుమార్ హెచ్చరించారు.
