Site icon NTV Telugu

AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి, పెట్టుబడులకు పచ్చజెండా

Cabinet Meeting

Cabinet Meeting

AP Cabinet : అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ రంగాల్లో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల సృష్టికి సంబంధించి పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని నీటిపథకాల అభివృద్ధి కోసం భారీగా రూ.9,514 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. త్రాగునీరు, సాగునీరు విభాగాల్లో ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయని ప్రభుత్వం తెలిపింది.

పరిశ్రమల విస్తరణలో భాగంగా, ప్రముఖ విరూపాక్ష ఆర్గానిక్స్ సంస్థకు 100 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో పెట్టుబడులకు వేగం చేరేందుకు ఐదు కంపెనీల ప్రాజెక్టులకు కూడా సమావేశం ఆమోదం తెలిపింది. రిలయన్స్ కన్జ్యూమర్ యూనిట్ ఏర్పాటు నేపథ్యంలో సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలును ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది.

Divorce Case: పెళ్లయిన 3 రోజులకే విడాకులు కోరిన భార్య.. కారణం ఇదే..

అమరావతి రాజధానిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతులు మంజూరయ్యాయి. రాజధాని నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఇవి కీలక ముందడుగులుగా భావిస్తున్నారు. వైజాగ్–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పనులకు కేబినెట్ పూర్తి ఆమోదం తెలిపింది. పారిశ్రామిక అభివృద్ధికి ఇది పెద్ద ఊతమివ్వనుంది. కుప్పం నియోజకవర్గంలో పాలర్ నదిపై నాలుగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సంబంధించి సవరించిన అనుమతులకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు.

ఉపాధ్యాయ విభాగానికి సంబంధించిన ఒక ముఖ్య నిర్ణయం ప్రకారం, 417 మంది భాషా పండిట్‌లను స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో స్కూళ్లలో భాషా బోధన నాణ్యత మరింత మెరుగుపడనున్నదని విద్యాశాఖ భావిస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో పెట్టుబడులు, మౌలిక వసతులు, నీటి వనరులు, విద్య తదితర రంగాల్లో వేగవంతమైన పురోగతికి దోహదం చేయనున్నాయి.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. కస్డడీకి ప్రభాకర్ రావు

Exit mobile version