రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు ఉండాలనేది బీజేపీ విధానమని అన్నారు. వాస్తవానికి 2014 మేనిఫెస్టోలోనే 25 జిల్లాల ఏర్పాటు గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కొత్త జిల్లాల్లో విలీనమయ్యే ప్రాంతాలు, ప్రధాన కార్యాలయాల ఎంపిక, పేర్లకు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని వీర్రాజు సూచించారు. ‘‘ఇప్పటికే మా పార్టీ ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గం జిల్లాగా పనిచేస్తోంది. ప్రజాభిప్రాయం ఓట్లు తప్ప మరొకటి కాదని, రాజ్యాంగం సర్వోన్నతమని జగన్ అభిప్రాయంతో నేను విభేదిస్తున్నాను. ప్రజలు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు ఏది చెప్పినా రాజ్యాంగం అని అనడం సరికాదు’’ అని వ్యాఖ్యానించారు.
బీజేపీపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలపై, రామతీర్థం ఆలయంలో విగ్రహాలను ధ్వంసం చేసిన వారిపై, అంతర్వేదిలో ఆలయ రథాన్ని తగులబెట్టిన వారిపై నేటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. “వెల్లంపల్లి హిందువులకు అనుకూలమా లేక హిందూ వ్యతిరేకమా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వైస్సార్ సీపీ అన్ని ఆదాయ వనరులను లాక్కుంది. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టివేసింది, దీని ఫలితంగా అభివృద్ధి అంతా నిలిచిపోయింది.”అని ఆయన విమర్శించారు. కుటుంబాలచే నడిచే రాజకీయ పార్టీలు ఎల్లప్పుడూ వనరుల దోపిడీలో మునిగిపోతున్నాయని ఆయన అన్నారు.