Site icon NTV Telugu

Ap New Districts: కాసేపట్లో ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం

Ap New

Ap New

ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోయింది. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు సంతరించుకుంది. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి రంగం పూర్తయింది. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌. 9.05 – 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అయింది. చివరిసారిగా 1979 లో ఏర్పడింది విజయనగరం జిల్లా. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకువెళ్లేందుకు జిల్లాల విభజన ఉపకరిస్తుందని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా జిల్లాలను విభజించారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం ప్రజలకు దగ్గర అవుతుంది. మారుమూల సరిహద్దు గ్రామాలకు దూరభారం తగ్గనుంది. జిల్లా పరిపాలన యంత్రాంగం ప్రజలకు మరింత చేరువకానుంది. ప్రజల ఇంటి వద్దకు పాలన ద్వారా జవాబుదారీతనం ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు.

ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలో సగటున ఆరు, ఏడు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 18 నుంచి 23 లక్షల జనాభా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటైంది. ప్రజలకు సౌకర్యంగా వుండడమే కాకుండా పరిపాలన సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం రెండు, మూడు, నాలుగు రెవెన్యూ డివిజన్లు ఉండేలా కొత్త డివిజన్లతో కలిపి మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి.

https://ntvtelugu.com/andhrapradesh-new-districts-final-gazette-notification-released/

కొత్త జిల్లాల్లో రెవిన్యూ డివిజన్లు ఇవే

* శ్రీకాకుళం జిల్లా : పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం

* విజయనగరం : బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం

* ప్వార్వతీపురం మన్యం : పార్వతీపురం, పాలకొండ

* అల్లూరి సీతారామరాజు : పాడేరు, రంపచోడవరం

* విశాఖపట్నం : భీమునిపట్నం (కొత్త), విశాఖపట్నం

* అనకాపల్లి : అనకాపల్లి, నర్సీపట్నం,

* కాకినాడ : పెద్దాపురం, కాకినాడ

* కోనసీమ : రామచంద్రాపురం, అమలాపురం, కొత్తపేట (కొత్త)

* తూర్పుగోదావరి : రాజమహేంద్రవరం, కొవ్వూరు

* పశ్చిమగోదావరి : నర్సాపురం, భీమవరం (కొత్త)

* ఏలూరు : జంగారెడ్డిగూడెం, ఏలూరు, నూజివీడు

* కృష్ణా : గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు (కొత్త)

* ఎన్టీఆర్‌ : విజయవాడ, తిరువూరు (కొత్త), నందిగామ (కొత్త)

* గుంటూరు : గుంటూరు, తెనాలి

* బాపట్ల : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)

* పల్నాడు : గురజాల, నర్సరావుపేట, సత్తెనపల్లి (కొత్త)

* ప్రకాశం : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)

* నెల్లూరు : కందుకూరు, కావలి, ఆత్మకూరు, నెల్లూరు

* కర్నూలు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)

* నంద్యాల : ఆత్మకూరు (కొత్త), డోన్‌ (కొత్త), నంద్యాల

* అనంతపురం : అనంతపురం, కళ్యాణదుర్గం, గుంతకల్‌ (కొత్త)

* శ్రీ సత్యసాయి : ధర్మవరం, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి (కొత్త)

* వైఎస్సార్‌ కడప : బద్వేల్, కడప, జమ్మలమడుగు

* అన్నమయ్య : రాజంపేట, మదనపల్లె, రాయచోటి (కొత్త)

* చిత్తూరు : చిత్తూరు, నగరి (కొత్త), పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త)

* తిరుపతి : గూడూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి (కొత్త), తిరుపతి.

Exit mobile version