Exams Schedule: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

inter exams 1

ఏపీలో పదో తరగతి, ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం మధ్యాహ్నం మంత్రులు ఆదిమూలపు సురేష్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు జరుగుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో 5,05,052 మంది విద్యార్థులు, సెకండియర్‌లో 4,81,481 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారని ఆయన వివరించారు.

అటు మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారని తెలిపారు. కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.