Site icon NTV Telugu

Andhra Pradesh: గంజాయి సరఫరాలో నంబర్ వన్

Ap Marijuana

Ap Marijuana

Andhra Pradesh Stood At First Place in Marijuana Case: గంజాయి సరఫరాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఏపీలోనే అత్యధికంగా 26% గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, ఆ రాష్ట్రంలో దొరికినంత గంజాయి మరే ఇతర రాష్ట్రాల్లో దొరకలేదని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) నివేదిక (2021) వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం.. 2021లో దేశవ్యాప్తంగా 7,49,761 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోగా, ఒక్క ఏపీలోనే 2,00,588 (26.75%) కిలోల గంజాయిని గుర్తించారు. ఇక ఏపీ తర్వాత రెండో స్థానంలో ఒడిశా (1,71,713) నిలిచింది. దేశంలో లభ్యమైన గంజాయిలో.. మొత్తం 50% ఈ రెండు రాష్ట్రాల్లోనే లభించిందంటే, ఏ స్థాయిలో అక్కడ గంజాయి సరఫరా జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో హషీష్ 18.14 కిలోలు, హషీష్ ఆయిల్ 6.13 లీటర్లు, 3 ఎల్ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 1775 కేసులు నమోదు కాగా.. 4202 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇక తెలంగాణ విషయానికొస్తే.. 35,270 కిలోల గంజాయి పట్టుకున్నట్టు ఆ నివేదికలో వెల్లడైంది. అలాగే 0.03 కిలోల హషీష్, 18.5 లీటర్ల హషీష్ ఆయిల్, 0.03 కిలోల హెరాయిన్, 0.01 కిలోల కెటామైన్, 31 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ కేసుల్లో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా మొత్తం 7618 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా.. అందులో ఒక్క గుజరాత్‌లోనే 3334 కిలోల హెరాయిన్ లభించింది. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా.. అక్కడ 1337 కిలోల హెరాయిన్‌ని పట్టుకున్నారు. ఇక డ్రగ్స్ అత్యధిక ప్రభావం ఉన్న పంజాబ్‌లో 443.51 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు ఎన్‌సీబీ నివేదిక వెల్లడించింది.

Exit mobile version