Site icon NTV Telugu

Andhra Pradesh: భీమ్లా నాయక్‌కు గుడ్‌న్యూస్..? ఏపీలో రేపు టిక్కెట్ల కమిటీ సమావేశం

ఏపీలో టిక్కెట్ల ధరలపై నెలకొన్న సమస్య కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఇటీవల టాలీవుడ్ పెద్దలు సీఎం జగన్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం గురువారం నాడు జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో రేపు 11:30 గంటలకు జరిగే భేటీ అనంతరం.. ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే టికెట్ ధరల ప్రతిపాదనలు సిద్ధం కాగా.. రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

భౌగోళిక కేటగిరీలో జీవో నంబర్ 35 ప్రకారం నాలుగు ప్రాంతాలను… మూడు ప్రాంతాలుగా లెక్కించాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ కలిపి నగర పంచాయతీ ఏరియాగా సిఫార్సు చేసిందని సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీల ఆధారంగా టిక్కెట్ల రేట్లు ఉంటాయని టాక్. టికెట్ల క్లాసుల్లోనూ సవరణకు సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న మూడు క్లాసులకు బదులు ఇక రెండే ఉండే అవకాశం ఉంది. డీలక్స్ కేటగిరిని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై అన్ని థియేటర్లలోనూ ఎకానమీ, ప్రీమియం రెండే క్లాసులు ఉండాలని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. 40 శాతం సీట్లు ఎకానమీ కేటగిరికి కేటాయించాలని.. మిగిలినవి ప్రీమియం కేటగిరిలో ఉంచాలని కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవేళ ధరలు ఖరారైతే ఈ నెల 25న రిలీజ్ కానున్న భీమ్లానాయక్ సినిమాతో పాటు త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్, ఆర్.ఆర్.ఆర్, ఆచార్య వంటి సినిమాలకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశముంది. ఇటీవల చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, ఆర్. నారాయణమూర్తి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, అలీ వంటి సినీ ప్రముఖులు సీఎం జగన్‌తో సమావేశమై టిక్కెట్ల ధరలపై విస్తృతంగా చర్చలు జరిపారు. అంతేకాకుండా మంగళవారం నాడు ‘ మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా జగన్‌ను కలిసి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించిన సంగతి విదితమే.

Exit mobile version