NTV Telugu Site icon

ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్‌.. వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంది..!

న్యాయమూర్తులపై అనుచిత పోస్టుల కేసు విచార‌ణ సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్టర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు.. భారతదేశంలోని చట్టాలు న్యాయస్థానాలను గౌరవించకపోతే వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది.. ట్విట్టర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని అభిప్రాయప‌డింది ఏపీ హైకోర్టు. ట్విట్టర్‌లో పోస్టులు డిలీట్ చేసినా.. విపిన్ అని టైప్ చేస్తే వెంటనే ఆ పోస్టులు వస్తున్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు హైకోర్టు న్యాయవాది అశ్వినీ కుమార్.. దీనిపై సీరియ‌స్ అయిన హైకోర్టు.. ట్విట్టర్ వద్ద ఉన్న న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టుల మెటీరియ‌ల్‌ను స్వాధీనం చేసుకోవాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేసింది.. పోలీసులను పంపి స్వాధీనం చేసుకునేలా ఉత్తర్వులిస్తామ‌ని హెచ్చ‌రించింది.. న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన విదేశాల్లో ఉన్న వారిని ఎప్పటిలోగా అరెస్టు చేస్తారని ఈ సంద‌ర్భంగా సీబీఐని ప్రశ్నించిన హైకోర్టు.. వచ్చే వారంలో కౌంటర్ వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ.. వచ్చే సోమవారానికి కేసు విచారణను వాయిదా వేసింది.