Site icon NTV Telugu

AP Government Notice: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి సర్కార్‌ నోటీసులు.. వారం రోజుల డెడ్‌లైన్‌..!

Government Notice

Government Notice

AP Government Notice: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అసలు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని నోటీసులు ఇచ్చింది జీఏడీ.. దీనికి కోసం వారం రోజులు గడువు పెట్టింది.. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేయటం రోసా నిబంధనలకు విరుద్ధమని నోటీసులో పేర్కొంది ఏపీ ప్రభుత్వం.. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసు జారీ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.. వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాలపై ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రత్యామ్నాయ మార్గాలున్నా… గవర్నర్‌ను ఎందుకు సంప్రదించాల్సి వచ్చిందని ఆ నోటీసుల్లో అడిగింది ప్రభుత్వం..

Read Also: Jiyaguda Case Twist: జియాగూడా కేసులో ట్వీస్ట్‌.. సాయినాధుని చంపింది స్నేహితులే

కాగా, ఉద్యోగుల వేతనాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అంశం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దయ్యే పరిస్థితులకు దారి తీసింది.. సర్వీసు నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ ఏపీఎన్జీవో సంఘం ఈ వ్యవహారంపై సీఎస్ కు ఫిర్యాదు చేయటంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.. ఉద్యోగులకు వేతనాలు, ఆర్ధిక ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాజ్ భవన్ మెట్లెక్కితే.. ఏపీ ఎన్జీవోల సంఘం ఈ వ్యవహారం సరైంది కాదని తప్పుబట్టింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల కోసం పోరాడేందుకు ప్రయత్నం చేస్తున్న సంఘం గుర్తింపు రద్దు కోసం ఫిర్యాదు చేయటం ఏమిటని ఉద్యోగులు మండిపడుతున్నారు.. ఉద్యోగ సంఘం.. గవర్నర్ కు ఫిర్యాదు చేయటంపై గుర్రుగా ఉన్న ప్రభుత్వంలోని పెద్దలే మరో ఉద్యోగ సంఘంతో సర్వీసు నిబంధనల ఉల్లంఘనల పేరిట ఫిర్యాదు చేసేలా ప్రోత్రహించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.. ఇక, ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం.. వారం రోజుల గడువు ఇవ్వడంతో.. ఉద్యోగుల సంఘం ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించటం లేదని మీడియాలో వచ్చిన కథనాల స్పందించిన ప్రభుత్వం.. తప్పుడు కథనాలు రాసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్‌ రావత్‌ వెల్లడించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమం, కొత్త నియామకాలు, ఇతర అన్ని అంశాలతో 8 పేజీల లేఖ విడుదల చేసింది ప్రభుత్వం. మెజారిటీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా… బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి మాత్రం 20వ తేదీ వరకు సమయం పడుతోంది. ఈ వాస్తవాలకు మసిపూసి… ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎస్ఎస్‌ రావత్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు ఏకంగా 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని వార్తపత్రికలు ప్రచురిస్తున్న కథనాలను ఎస్ఎస్ రావత్ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు.

Exit mobile version