Site icon NTV Telugu

Ramakrishna: అమరావతిపై మంత్రి ధర్మాన.. అధర్మంగా మాట్లాడుతున్నారు..!

Ramakrishna

Ramakrishna

అమరావతి రాజధాని విషయంలో రగడ కొనసాగుతూనే ఉంది.. పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది.. అయితే, అమరావతి రాజధాని అంశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అధర్మంగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా ఆమోదించిన విషయం వాస్తవమా కాదా..? అని నిలదీసిన ఆయన… ఆనాడే మూడు రాజధానులు కావాలని వైఎస్‌ జగన్ ఎందుకు చెప్పలేదు..? అని ప్రశ్నించారు… శాసనం, చట్టం, ధర్మాలను విస్మరించి వైసీపీ ప్రభుత్వం మోసానికి పాల్పడుతోందని ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మూడు రాజధానుల పాట పాడడం దుర్మార్గం అని.. అమరావతి రైతులను రెచ్చగొట్టే పద్ధతుల్లో మంత్రులు వ్యాఖ్యానించడం తగదని హితవుపలికారు రామకృష్ణ.

Read Also: Munugode Bypoll: మునుగోడుపై సీఎం కేసీఆర్ సమావేశం.. రేపే అభ్యర్థి ప్రకటన?

కాగా, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికను అమలు చేయలేదని వ్యాఖ్యానించారు.. శ్రీకృష్ణ కమిటీ నివేదికనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారని వివరించారు.. ఇక, రాజధాని మార్చుకోవడానికి ఓ చట్టం ఉందని.. కావాలంటే ఢిల్లీలో ఉన్న దేశ రాజధానిని కూడా మార్చుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు, అమరావతి రైతుల ఆవేదన కరెక్టే కావచ్చు… కానీ, అంత డబ్బును ఒక్క ప్రాంతంపైనే పెట్టే పరిస్థితి లేదని తెలిపారు.. రాజధాని ఏర్పాటుకు 55 వేల ఎకరాలు అవసరం లేదని స్పష్టం చేశారు.. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ రాజధాని కోసం వందల కిలో మీటర్లు వెళ్లాలా అని నిలదీశారు. విశాఖలో రాజధానిని అడ్డుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు హెచ్చరించిన విషయం తెలిసిందే.

Exit mobile version