Chandrababu: సింగపూర్లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పి. నారాయణ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్), నారా లోకేష్ (ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, హెచ్‌ఆర్‌డి), టిజి భరత్ (పరిశ్రమలు, కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్)తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాలు, సింగపూర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆరోగ్యం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమీకండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి మరియు గ్రోత్ రేట్‌ల గురించి హైకమిషనర్ శిల్పక్ అంబులే వివరించారు.
Read Also: Srushti IVF Scandal: విజయవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసుల ఆరా..
హైకమిషనర్ శిల్పక్ అంబులే మాట్లాడుతూ, సింగపూర్ ప్రభుత్వం భారత్‌తో మంచి సంబంధాలను కలిగి ఉందని, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. సింగపూర్ ప్రభుత్వం మరియు స్థానిక పారిశ్రామిక వర్గాల్లో చంద్రబాబు నాయుడు బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి రాజధాని ప్రాజెక్టును చేపట్టినప్పటికీ, కొన్ని కారణాల వల్ల సింగపూర్ ఆ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లిన విషయాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే, ఈ పర్యటన ద్వారా ఆ లోటును సరిచేసేందుకు ప్రయత్నిస్తానని, అమరావతి నిర్మాణంలో సింగపూర్‌తో మళ్లీ భాగస్వామ్యం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. సమావేశంలో సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీలు, పెట్టుబడులకు గల అవకాశాలను వివరించారు.
