ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరగనుంది.. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన భేటీ అవుతుంది.. వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాల నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం..ఆన్‌లైన్లో సినిమా టికెట్లు అమ్మకం, సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసే అర్డినెన్సుకు అమోదం తెలిపే అంశంపైనా చర్చించే ఛాన్సుంది. ఇక, దేవాదాయ స్థలాలు, దుకాణాల లీజుల అంశంపై దేవాదాయశాఖ చట్టసవరణ, దేవాదాయ శాఖలో విజిలెన్స్ అండ్ సెక్యూరిటీవింగ్ ఏర్పాటుపై చర్చించనుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ఓ శాఖ ఏర్పాటు చేసే విషయమై కేబినెట్ చర్చించనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల విషయంపై కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశముంది.
మరోవైపు.. సీఎం వైఎస్ జగన్ ఇవాళ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం సహా నేతలపై వైసీపీ శ్రేణుల దాడులపై ఇప్పటికే రాష్ట్రపతికి ప్రతిపక్షనేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచకపాలన జరుగుతోందని 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు రాష్ట్రపతిని కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి సహా ఇతర అంశాలపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరణ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాడులకు దారితీసిన పరిస్థితులను గవర్నర్‌కు సీఎం వివరించనున్నట్లు సమాచారం. దాడులకు ముందు టీడీపీ నేతలు తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీలు, ఇతర ఆధారాలను గవర్నర్‌కు సమర్పించే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ భావిస్తున్నందున..సభ నిర్వహణపైనా గవర్నర్‌తో చర్చించే అవకాశాలున్నాయి.