NTV Telugu Site icon

Vizag Railway Zone: విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం అలా.. ఏపీ బీజేపీ నేతలు ఇలా..!

Vizag Railway Zone

Vizag Railway Zone

విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం వాదనల ఒకలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతల మాటలు మాత్రం మరోలా ఉన్నాయి.. విశాఖపట్టణంలో రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో గందరగోళానికి తెరదించుతూ సాధ్యం కాదని తేల్చిచెప్పేసింది కేంద్రం… విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లాభదాయకం కాదని రైల్వే శాఖ స్పష్టంగా చెప్పేసింది. విభజన సమస్యలు, హామీలపై ఢిల్లీలో కేంద్ర హోంశాఖ నిన్న సమావేశం నిర్వహించింది. హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో రెండు గంటలకుపైగా ఈ సమావేశం జరిగింది. ఏపీ, తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో రైల్వే జోన్, విభజన సమస్యలు సహా మొత్తం 14 అంశాలపై చర్చ జరగగా… విశాఖకు రైల్వే జోన్ విషయంపై కుండబద్దలు కొట్టిన కేంద్రం.. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టం చేసింది.. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకనే డీపీఆర్‌ను ఆమోదించలేదని రైల్వే బోర్డు చైర్మన్ తెలిపారు.. అయితే, దీనిపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆధ్వర్యంలోని బృందం అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.. జోన్ ఏర్పాటు లాభదాయకం కాదన్న విషయం తెలిసే దానికి చట్టపరంగా హామీ ఇచ్చారని గుర్తు చేసింది. లాభాలు వస్తే మాత్రం అప్పుడు ఏ చట్టంతో అవసరం లేకుండానే రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసేదని చెప్పినట్టుగా తెలుస్తోంది..

Read Also: Whatsapp: వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్.. జూమ్‌, గూగుల్‌ మీట్‌లా…!

ఇక, రైల్వే బోర్డు చైర్మన్ వ్యాఖ్యలపై స్పందించిన అజయ్‌భల్లా.. జోన్ ఏర్పాటు సాధ్యం కాదన్న విషయాన్ని అధికారుల స్థాయిలోనే నిర్ణయించేయడం సరికాదని, రైల్వే జోన్ విషయం రాజకీయ పరమైన అంశం కాబట్టి దానిని కేబినెట్ ముందు పెడితే అది ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని సూచించారట.. అయితే, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. ఇంకా కేంద్రంపై నమ్మకంతోనే ఉన్నారు.. విశాఖ రైల్వే జోన్ ను కేంద్ర మంత్రి త్వరలో ప్రారంభిస్తారన్న ఆయన.. రైల్వే జోన్ వియషంలో ఎటువంటి వివాదాలు లేవన్నారు.. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది.. పనులు జరుగుతున్నాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు భూమి సేకరించాల్సి ఉందన్నారు.. చక్రం తిప్పిన నాయకుడు నేషనల్ ఫ్రంట్ కన్వీనరుగా ఉన్న సమయంలో ఏపీకి ప్రాజెక్టులు ఎందుకు తేలేదు..? అని ప్రశ్నించిన ఆయన.. అన్ని విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్‌లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్చ భారత్ లో పాల్గొన్న సోము వీర్రాజు.. ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్‌పై స్పందించారు.