తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తినబాట పట్టారు.. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఇక, రేపు రాజధానికి చేరుకోనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశానికి కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని సమస్యలు చాలా ఉన్నాయి.. కృష్ణా నది జలాల విషయం జల జగడం రోజు రోజుకీ రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ పెంచుతూ పోతోంది.. ఈ నేపథ్యంలో.. ఇద్దరు సీఎంలు ఒకేసారి హస్తినకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. పైగా ఒకే నెలలో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి.
ఇవాళ ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. రేపు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అవుతారు… కృష్ణా, గోదావరి నదీ జలాల అంశాలు, నదీ యాజమాన్య బోర్డుల పరిధి నోటిఫికేషన్ తదితర విషయాలపై చర్చిస్తారు. ఇక, ఎల్లుండి కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్షిస్తారు. ఆ తర్వాత ఎల్లుండి కేంద్ర ఆహార, పౌర సరఫరాల మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు కేసీఆర్. ధాన్యం కొనుగోళ్లపై చర్చించి.. అదే రోజు తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఇక, రేపు మధ్యాహ్నం ఢిల్లీ బాటపట్టనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. ఎల్లుండి వామపక్ష తీవ్రవాదం పై కేంద్ర హోంశాఖ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ మరియు యూపీ రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు. అయితే, ఒకే సమావేశంలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.. రెండు రాష్ట్రాల మధ్య గతంలో మంచి వాతావరణం ఉన్నా.. ఇప్పుడు మాత్రం కాస్త చెడింది.. ఈ భేటీ ఇద్దరు సీఎంలు ఎదురుపడితే ఎలా ఉంటుంది? పలకరించుకుంటారా..? ఎవరా దారిలో వారు వెళ్లిపోతారా? అనేది ఆసక్తికరంగా మారింది.