Tadipatri Violence: తాడిపత్రిలో రణరంగం.. కేతిరెడ్డి ఇంటిపై రాళ్ల దాడి! ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం! వాహనాలకు నిప్పు!

Tadipatri Violence

Tadipatri Violence

Tadipatri Violence: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల వేళ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల వ్యవహారం రాజకీయ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. ఇగడూరు, సజ్జలదిన్నె పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు వేయవద్దంటూ కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఈ క్రమంలో రాత్రి సమయంలో ఓ వైసీపీ నేతకు చెందిన స్కార్పియో వాహనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు సమాచారం.

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
ఈ ఘటనల నేపథ్యంలో ఉదయం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇగడూరు, సజ్జలదిన్నె గ్రామాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. సర్పంచ్ నామినేషన్ల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, వాహనానికి నిప్పు పెట్టిన ఘటనపై బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే కేతిరెడ్డి పర్యటనతో తాడిపత్రిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్ల దాడి
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు.. ఈ దాడిలో ఇంటి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కేతిరెడ్డికి చెందిన సుమారు 10 స్కార్పియో వాహనాలు ధ్వంసమయ్యాయని చెబుతున్నారు.. బైకులకు కూడా నిప్పు పెట్టడంతో అవి దగ్ధమైన వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాకు ఎక్కాయి.. ఇక, వరుస ఘటనలతో తాడిపత్రిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరువర్గాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే, సర్పంచ్ నామినేషన్ల విషయంలో మొదలైన వివాదం వాహనాలకు నిప్పు పెట్టడం, మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడి, వాహనాల ధ్వంసం వరకు వెళ్లడంతో తాడిపత్రిలో తీవ్ర ఆందోళన నెలకొంది.