JC vs Kethireddy: తాడిపత్రి ఘర్షణలో ట్విస్టుల మీద ట్విస్టులు.. పెద్దారెడ్డిపై జేసీ సంచలన వ్యాఖ్యలు

Jc Prabhakar Reddy

Jc Prabhakar Reddy

JC vs Kethireddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన రాజకీయ ఘర్షణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారింది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఉద్దేశించి జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో తన కళ్లలో కన్నీళ్లు చూసిన పెద్దారెడ్డి.. ఇప్పుడు తన కళ్లలో వరద చూస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ బలం ఉందని విర్రవీగితే ఫలితం ఇలాగే ఉంటుందని హెచ్చరించారు. తన నియోజకవర్గాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంటే పెద్దారెడ్డి నాశనం చేశారని ఆరోపించారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా సహించానని, అయితే తన ప్రజల జోలికి వస్తే మాత్రం క్షమించేది లేదని స్పష్టం చేశారు. తాను పెద్దారెడ్డి ఇంటి వద్దకు వెళ్లకూడదా? గతంలో వారు తమ ఇంటి వద్దకు రాలేదా? అని ప్రశ్నించారు. పెట్రోల్ బాంబులు వేసింది తాము కాదని, పెద్దారెడ్డి వర్గీయులే వేశారని ఆరోపించారు. ముందస్తు ప్రణాళికతోనే తమ ఇంటిపై రాళ్ల దాడి చేయించుకున్నారని విమర్శించారు.

గతంలో తమ కార్యకర్తలను తరిమి తరిమి కొట్టారని, ఇప్పుడు వారే తిరగబడ్డారని జేసీ వ్యాఖ్యానించారు. తన అంతు చూస్తానంటున్న పెద్దారెడ్డి అంతు చూసే సమయం ప్రజలకు వచ్చిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. యల్లనూరు ప్రజలు సహకరిస్తే అక్కడ మార్పు తీసుకొచ్చి చూపిస్తానన్నారు. కార్లు కాలిస్తే ఏమవుతుందని, బీమా వస్తుందని వ్యాఖ్యానించారు. తన కుమారులను బయటకు పంపించాలని, కార్యకర్తలు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. జనం, ధనం ఉన్నప్పటికీ ఆలోచన లేదంటూ పెద్దారెడ్డిని ఎద్దేవా చేశారు. తాడిపత్రి ప్రజలు పెద్దారెడ్డిని వద్దనుకున్నారని, అందుకే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

వీడియోలు, సీసీ ఫుటేజ్‌తో ఇరు వర్గాల ఆరోపణలు
మరోవైపు తాడిపత్రి ఘర్షణకు సంబంధించి ఇరు పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు నిన్న ఒక వీడియోను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా దగ్గరుండి రాళ్లు వేయించారని ఆ వీడియో ఆధారంగా ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను సవాల్ చేస్తూ వైసీపీ నాయకులు నేడు సీసీటీవీ ఫుటేజ్‌ను విడుదల చేశారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులే దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు.

పెద్దారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు
తాడిపత్రి ఘర్షణపై పోలీసులు చర్యలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఒకవైపు ఇరు పార్టీల నేతలు వీడియోలు, సీసీ ఫుటేజ్‌లను బయటపెడుతూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండగా, మరోవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. దీంతో తాడిపత్రి రాజకీయాల్లో ఈ ఘర్షణ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.