JC Prabhakar Reddy: ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే సర్పంచ్‌లతో రాజీనామా చేయిస్తా..!

Jc

Jc

JC Prabhakar Reddy: చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలన్నదే తన ప్రయత్నమని తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా కాకుండా సమాజంలో మార్పు తీసుకురావడానికి చేసే పోరాటంగా తాను భావిస్తానని పేర్కొన్నారు. కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయలేని వారిని నాయకులుగా ఎన్నుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తాడిపత్రి మున్సిపల్ కౌన్సిల్‌లోని 49 మందిలో 26 మంది బీటెక్, ఎంటెక్, డాక్టరేట్ చదివిన వారే ఉన్నారని తెలిపారు. తన కౌన్సిలర్లను చూసి గర్వపడుతున్నానని చెప్పారు. ఏడాదిలోగా మార్పు తీసుకురాలేకపోతే తమ సర్పంచులతో రాజీనామా చేయిస్తానని స్పష్టం చేశారు.

సర్పంచ్ అంటే ఉదయాన్నే వార్డుల్లోకి వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాలని, కాలువలు శుభ్రం చేయించి, పరిసరాల్లో చెత్త లేకుండా చూడాలని సూచించారు. ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సొంత వనరులను సృష్టించుకోవాలని అన్నారు. డబ్బు లేకపోయినా వార్డు మెంబర్ ప్రజలకు ఎంతో సేవ చేయగలరని, ప్రజాసేవకు కావాల్సింది డబ్బు కాదని.. ధైర్యం, ఆసక్తి అని పేర్కొన్నారు. దౌర్జన్యాలు చేయడం, వాహనాలు దహనం చేయడం, ఇంట్లో కూర్చుని నామినేషన్లు వేసే రోజులు పోయాయని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. యూట్యూబ్‌ల ద్వారా ప్రచారం చేసుకోవడం కంటే ప్రజల్లోకి వెళ్లి వారి మన్ననలు పొందాలని సూచించారు. ప్రతి వార్డుకు సంబంధించిన ఏ టు జెడ్ సమాచారంతో పుస్తకాలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ వార్డు సమాచార పుస్తకాలను రాష్ట్రంలోని మేయర్లందరికీ పంపిస్తానని చెప్పారు. ప్రభుత్వం నిధులు ఇస్తుందని, వాటిని ఉపయోగించి ప్రజలకు మంచి చేయడం మాత్రం ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉందని వ్యాఖ్యానించారు తాడిపత్రి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి..