EX MLA Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. ఏడాది తర్వాత తాడిపత్రి పట్టణంలోకి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రవేశించాడు. కేతిరెడ్డి హఠాత్తుగా తన సొంత ఇంట్లో ప్రత్యక్షం కావడంపై పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. కానీ, న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో ఇటీవలే కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు ఆయన. మరోవైపు తాడిపత్రికి పెద్దారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు జేసీ వర్గీయులు.
ఈ సందర్భంగా ఎన్టీవీతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నాడు.. పార్టీ కార్యక్రమాలు చేయకుండా ఏడాది కాలంగా నియోజవర్గానికి దూరంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాడిపత్రి పట్టణానికి వెళ్లిన గంటలోపే పోలీసులు నన్ను పంపించేశారు.. ప్రైవేట్ సైన్యాన్ని అడ్డం పెట్టుకొని బెదిరించాలని చూస్తున్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి.. యుద్ధానికైనా, రాజకీయానికైనా సిద్ధంగా ఉన్నాను.. నేను చేసింది ప్రభాకర్ రెడ్డితో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. ఇక, నా ఇంటి నిర్మాణం అంతా సక్రమంగానే జరిగింది అని కేతిరెడ్డి పెద్దారెడ్డి వెల్లడించారు.
