NTV Telugu Site icon

AP Crime: అన్నంత పని చేసింది..! వారం రోజుల శిశువును అమ్మేసిన తల్లి..

Baby Boy

Baby Boy

AP Crime: మానవత్వం మంట గలిపి మానవ సంబంధాలకు విలువలు లేకుండా సభ్యసమాజంలో చివరకు శిశువును సైతం విక్రయించే దారుణానికి ఒడిగట్టారు. దత్తత పేరుతో శిశువును కొనుగోలు చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే గుమ్మఘట్ట మండలంలోని నేత్రపల్లి గ్రామానికి చెందిన బళ్లారి రూపమ్మకు 15 రోజుల క్రితం మగ శిశువు జన్మించాడు. ఆమెకు అంతకు ముందు ఆరేళ్ల బాలిక కూడా ఉంది. కుటుంబ కలహాలతో భర్తతో కాకుండా రాయదుర్గంలో ఒంటరిగా జీవిస్తుంది. ఈమె గర్భవతిగా ఉన్నపుడే ఆమె రాయదుర్గం పట్టణ శివారులో ఒంటరిగా ఉండేది. అప్పటికే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆమె ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అనంతపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి మెరుగైన చికిత్సలు అందించారు.

Read Also: Srilanka : ప్రశాంతంగా కొనసాగుతున్న శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికల పోలింగ్

అయితే, అప్పటి నుంచి తనకు పుట్టే సంతానాన్ని అమ్మేస్తానంటూ చెబుతూ వచ్చేది. దీంతో ఆమె బంధువులకు, కుటుంబీకులకు సమాచారం అం దించినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఈ నేపథ్యంలో ఆమె ప్రసవించేదాకా పర్యవేక్షిస్తూ వచ్చారు. అంతిమంగా మగశిశువును 15 రోజుల క్రితం జన్మనిచ్చింది. కాగా ఆమెకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు స్త్రీ శిశుసంక్షేమ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో కౌన్సిలింగ్ ఇస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆమె జన్మనిచ్చిన మగశిశువు ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. అందులో భాగంగా శుక్రవారం ఆమె ఉన్న ఇంటి వద్దకు వెళ్లి శిశువు గురించి ఆమెను ఆరా తీశారు. కానీ వారం క్రితమే ఆమె శిశువును రూ. 80 వేలకు ఆమె విక్రయించేసినట్లు వెల్లడించింది. దీనిపై అప్రమత్తమైన సిబ్బంది పూర్తిస్థాయి విచారణ చేపట్టి ఆరా తీశారు. కాగా, రాయదుర్గం పట్టణానికి చెందిన ఎరుకుల రాజశేఖర్‌కు దత్తత ఇచ్చినట్లు పత్రాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించి శిశువును ఎక్కడ ఉంచారన్న విషయంపై గాలించాలని కోరడంతో రాజశేఖర్‌ను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. అతని సమీప బంధువులకు సంతానం లేకపోవడంతో వారి వద్ద ఉన్నట్లు తెలిపారు. శిశువును వెంటనే స్టేషన్‌కు తీసుకురావాలని ఆదేశించడంతో హుటాహుటిన తీసుకొచ్చి ఐసీడీఎస్ సీడీపీవో పద్మావతికి అప్పగించారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితిపై వైద్యశాలలో పరీక్షలు చేయించి స్వాధీనం చేసుకున్నారు. శిశువును నేరుగా దత్తత ఇవ్వడం కుదరదని తల్లి రూపమ్మకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన ఆరోగ్యం సరిగ్గా లేదని తన తదనంతరం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే కారణంతో వారికి అప్పగించినట్లు ఆమె చెప్పింది. సంతృప్తి చెందని అధికారులు ఆమె ప్రవర్తనపై తీవ్ర అనుమానాలు ఉండడంతో శిశువును శిశు సంక్షేమ కేంద్రానికి అప్పగించాలని నిర్ణయించారు.