ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. నువ్వా-నేనా అన్నట్టుగా ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో వరుసగా మహిళలపై జరుగుతున్న ఘటనలపై అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఏపీలో జంగిల్ పాలన సాగుతోందని, మహిళలకు భద్రత లేకుండా పోయిందని తొలుత చంద్రబాబు వ్యాఖ్యానించగా.. వైసీపీ నేతలు తమదైన రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ ప్రతిపక్ష పార్టీపై మండిపడ్డారు.
ఏపీలో మహిళలపై జరిగిన ఘటనల విషయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ఇటువంటి ఘటనలపై ప్రతిపక్ష నాయకులు శవ రాజకీయాలు చేయడం సరికాదని చెప్పిన అరుణమ్మ.. దారుణాలు జరిగినప్పుడు మహిళలకు అండగా నిలవాలే తప్ప, వాళ్ళను మానసికంగా చంపేలా ప్రయత్నించకూడదని సూచించారు. మహిళలకు రక్షణ కల్పించే విషయంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, గతంలో ఏ ప్రభుత్వమూ చేపట్టలేదన్నారు. గుంటూరు జిల్లా తుమ్మపాడులో మహిళపై జరిగిన ఘటనపై పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారని, 9 నెలలలోపే వారికి శిక్ష పడేలా చేశారన్నారు.
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలో చంద్రబాబు ప్రవర్తించిన తీరు సరికాదని ఆనం అరుణమ్మ ఆరోపించారు. మహిళల రక్షణ కోసం సీఎం జగన్ ‘దిశ’ యాప్‌ను ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఆ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళల్ని వెంటనే పోలీసులు ఆదుకునేలా చర్యలు కొనసాగుతున్నాయన్నారు. మహిళలకు రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని, 100 – 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యతకు అద్దం పడతాయని ఆనం అరుణమ్మ చెప్పారు.
