Godavari Water: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పాయకరావుపేట వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లాకు చేరుకున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
పోలవరం ఎడమ కాలువ ద్వారా నాలుగు జిల్లాల పరిధిలో 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 9 లక్షల మందికి తాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించనున్నారు. పోలవరం ఎడమ కాలువ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లు ఖర్చు చేసింది. కాలువ ద్వారా వచ్చిన గోదావరి జలాలతో అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో జిల్లాలో సాగునీటి లభ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉంది. ఇక, ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు సహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు..

