Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..

Godavari Floods

Godavari Floods

Godavari Floods: గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉద్ధృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభావం చూపుతోంది. పి.గన్నవరం మండలంలోని కనకాయలంక కాజ్వేపైకి వరద నీరు చేరడంతో కాజ్వే పూర్తిగా జలమయమైంది. దీంతో కోనసీమ జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు గోదావరిలోకి చేరడంతో కోనసీమలోని గోదావరి, వైనతేయ, వశిష్ట, గౌతమి, వృద్ధ గౌతమి పాయలన్నింటిలోనూ నీటి ప్రవాహం పెరిగింది. వరద పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు వరద ఉద్ధృతి మరింత పెరిగితే అయినవిల్లి ఎదురుబిడియం కాజ్వేపైకి కూడా వరద నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరం లేకుండా వరద నీటిలోకి వెళ్లవద్దని, కాజ్వేలపై ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపడుతున్నారు. కాగా, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద జలాల ప్రభావంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11 పాయింట్ 6,0 అడుగులకు చేరుకుని మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. నీటిమట్టం 11 పాయింట్ 7,5 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. అయితే గత కొద్ది గంటలుగా గోదావరి వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతుండటంతో నీటిమట్టం మరింత పెరిగి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని చేరుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. వరద పరిస్థితులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. గోదావరి నుంచి వస్తున్న భారీ నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ధవళేశ్వరం బ్యారేజ్‌కు సంబంధించిన 175 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి 9 లక్షల 62 వేల క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.