Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ

Aqua Farmers

Aqua Farmers

Aqua Farmers: ఆక్వా రంగాన్ని ఓవైపు ఫీడ్‌ ధరలు.. ఎగుమతులపై ఆంక్షలు.. ఇలా వరుసగా సమస్యలు వేధిస్తున్నాయి.. అయితే, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల సదస్సు జరగనుంది. ఆక్వా రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఫీడ్ ధరలను ఒకే నెలలో రెండుసార్లు పెంచడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రాసెసింగ్ ప్లాంట్ల తీరుపై చర్చించడం, నాణ్యమైన సీడ్‌ సరఫరా వంటి అంశాలు సదస్సులో ప్రధానంగా ప్రస్తావనకు రానున్నాయి. ట్రేసబిలిటీ లేని హేచరీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేయనున్నారు.

ఆక్వా రైతులకు విద్యుత్ రాయితీ పెంచాలని, వాటర్ మోటార్ల విద్యుత్ వినియోగంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. NCEL ద్వారా రొయ్యల కొనుగోళ్లు, కేంద్ర ప్రభుత్వ జోక్యం, రైతులు చెల్లించే ఆక్వా సెస్‌ను తిరిగి రైతుల సంక్షేమానికే వినియోగించడం, NFDB ద్వారా సబ్సిడీలు అందించడం వంటి అంశాలపైనా చర్చ జరగనుంది. అలాగే ఆక్వా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న వైరస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు విజ్ఞప్తి చేయనున్నారు. ఆక్వా రైతుల భవిష్యత్తుకు కీలకమైన ఈ సదస్సుకు భారీగా తరలివచ్చి సమస్యల పరిష్కారానికి తమ గళాన్ని వినిపించాలని నిర్వాహకులు రైతులకు పిలుపునిచ్చారు.