Prabhala Theertham: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ జగ్గన్నతోట ప్రభల తీర్థం నేడు అత్యంత వైభవంగా జరగనుంది. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ ప్రభల తీర్థానికి తాజాగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదాను కల్పించడంతో ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. సుమారు 450 ఏళ్లుగా కనుమ పండుగ రోజున కొనసాగుతున్న ఈ సంప్రదాయ ప్రభల జాతరను 11 గ్రామాల ప్రజలు అచంచల విశ్వాసంతో నిర్వహిస్తూ వస్తున్నారు. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామ శివారులోని జగ్గన్నతోట ప్రభల తీర్థానికి ఈసారి ప్రధాన వేదికగా ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ ప్రభల తీర్థానికి ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఈ సంప్రదాయంపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం ప్రశంసలు కురిపించారు.
Read Also: Astrology: జనవరి 16, శుక్రవారం దినఫలాలు..
ఈ ప్రభల తీర్థానికి వచ్చే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంబాజీపేట మండలంలోని జగ్గన్నతోట చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు, ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. అలాగే, భక్తుల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. వైభవోపేతంగా జరుగుతున్న ఈ జగ్గన్నతోట ప్రభల తీర్థం, సంప్రదాయం-సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తెస్తోంది.
