Ambati Rambabu : ఋషికొండపై విమర్శలు కాదు.. విచారణ చేయండి

  • ఋషికొండ భవనంపై అంబటి స్పందన
  • నిర్మాణంపై విచారణకు డిమాండ్
  • డీలిమిటేషన్‌పై జగన్ కసరత్తు
  • పంచాయతీ ఫలితాలపై ధీమా
Ambati

Ambati

వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు మీడియా సమావేశంలో ఋషికొండ భవన వివాదంతో పాటు పలు కీలక రాజకీయ అంశాలపై స్పందించారు. విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని, అక్కడ రూ. 451 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకమైన భవనాన్ని నిర్మించారని ఆయన తెలిపారు. ఈ భవనాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోకుండా, ప్రజల సందర్శన కోసం టికెట్ పెట్టి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఋషికొండ భవనంపై స్పందన.. విచారణకు డిమాండ్

విదేశీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ప్రముఖుల రాక సందర్భాల్లో ఈ భవనాన్ని సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని అంబటి రాంబాబు అన్నారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా కాకుండా అనవసర విమర్శలకు దిగుతోందని విమర్శించారు. భవన నిర్మాణంపై ఏమైనా అనుమానాలు ఉంటే తప్పకుండా విచారణ జరపాలి కానీ, ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం మాత్రం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

డీలిమిటేషన్ బిల్లుపై వైఎస్సార్‌సీపీ వైఖరి

నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపైనా ఆయన మాట్లాడారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబోతోందని, ఈ విషయంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నేతలతో చర్చిస్తున్నారని వెల్లడించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ధీమా

పంచాయతీ ఎన్నికలపై స్పందిస్తూ, గ్రామాల్లో పోలీసుల ఒత్తిడి, ప్రత్యర్థుల దౌర్జన్యాలు ఉన్నప్పటికీ తమ పార్టీ 50 శాతం పంచాయతీలను గెలుచుకుందని అంబటి రాంబాబు చెప్పారు. ఈ ఫలితాలు తమ పార్టీకి గ్రామీణ స్థాయిలో ఉన్న బలమైన పునాదిని సూచిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.