ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీకి భారీ మెజారిటీ రావడంపై మంత్రి అంబటి రాంబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆత్మకూరులో టీడీపీ పోటీలో లేకున్నా కుట్రలు చేసిందని ఆరోపించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేశారని.. బద్వేలులో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలే బీజేపీ ఏజెంట్లుగా ఉన్నారని అంబటి రాంబాబు విమర్శలు చేశారు. గత మూడేళ్లలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో వైసీపీ ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని తెలిపారు. గత ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి 22 వేల మెజారిటీ సాధిస్తే.. ఇప్పుడు 82 వేల మెజారిటీ వచ్చిందని గుర్తుచేశారు. ఆత్మకూరులో ప్రజలు వైసీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టారన్నారు.
అటు మద్యం విషయంలో వస్తున్న ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు చెంచాలు మద్యంలో విషం ఉందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న 20 డిస్టిలరీలను గత ప్రభుత్వాలే ఇచ్చాయన్నారు. ప్రైవేట్ ల్యాబ్‌లో పరీక్షించాం అంటున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసే వారిపై అధికారులు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సైజ్ ఎంత గెలవటానికి అని అంబటి రాంబాబు చురకలు అంటించారు. టీడీపీ సహకరించకపోతే ఆ మాత్రం ఓట్లు అయినా బీజేపీకి వచ్చి ఉండేవా అని ప్రశ్నించారు. ఆత్మకూరు ఎన్నికల్లో బీజేపీకి జనసేన ఎందుకు ప్రచారం చేయలేదని అంబటి రాంబాబు నిలదీశారు.