Ambati Rambabu Comments On Pawan Kalyan: నిన్న (03-12-22) హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరిగిన సీఏ విద్యార్థుల అంతర్జాతీయ సదస్సుకు జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే! ఈ సందర్భంగా ఆయన తన రాజకీయ జీవితంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానొక ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడినని, ఇలా చెప్పేందుకు తనకెలాంటి మొహమాటం లేదని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ వాస్తవమేనంటూ తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారనేది వాస్తవమని, ఆయన కేవలం నటుడిగానే విజయవంతం అయ్యారని చెప్పారు. పవన్ రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్నా.. ఒక్కసారి కూడా గెలిచింది లేదని ఎద్దేవా చేశారు. ఇకపై కూడా పవన్ సక్సెస్ అయ్యే అవకాశాలు లేవని, సైద్ధాంతిక విధానమంటూ పవన్ రాజకీయల్లో తన పాత్రను సరిగా పోషించలేకపోతున్నారని విమర్శించారు. విప్లవనేతగా పార్టీ పెట్టిన పవన్ తనని తాను చేగువేరా అని చెప్పుకుంటాడని.. కానీ, సిద్ధాంతాలను పక్కనబెట్టి కమ్యూనిస్టులతో, బీజేపీతో కలిశారని వ్యాఖ్యానించారు. పవన్ ఎప్పటికీ ఫెయిల్యూర్ నాయకుడేనని వెల్లడించారు.
అంతకుముందు.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించడంపై అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై అభూత కల్పనలు సృష్టించి, చంద్రబాబు లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2018లోనే ప్రాజెక్టును పూర్తి చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అని ప్రశ్నించారు. బాబు నిర్వాకం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని.. అన్ని అడ్డంకుల్ని అధిగమించి, ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని, ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి చంద్రబాబుని కూడా పిలుస్తామని అన్నారు. ఇందులో తొందర పడాల్సిందేమీ లేదని, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ఎక్కడా తప్పు పట్టలేదని స్పష్టం చేశారు. ఈరోజు పూర్తవుతుంది, రేపు పూర్తవుతుందని తాము చంద్రబాబులా అసత్యాలు చెప్పమని.. సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్టు ప్రారంభమవుతుందని పునరుద్ఘాటించారు. చంద్రబాబు తీసుకున్న తొందరపాటు చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందన్నారు.
