Site icon NTV Telugu

Ambati Rambabu: ఆ వెన్నుపోటు రక్తపు మరకల్ని తుడిచే ప్రయత్నం చేశారు

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu Comments On Chandrababu Unstoppable Show: బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. బాలకృష్ణ, చంద్రబాబు బావ బావమరుదులు అయితే.. లోకేష్, బాలకృష్ణ మామా అల్లుళ్ళని.. ఒక బంధువర్గం కూర్చుని ఆ షోలో మాట్లాడుకున్నారని అన్నారు. 27 ఏళ్ళ కిందట చేసిన వెన్నుపోటు రక్తపు మరకలను బావ, బావమరుదులు కలిసి తుడిచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇంతవరకు ఒక్క రాజకీయ నాయకుడు కూడా హాజరుకాని టాక్ షోకు చంద్రబాబు ఎందుకు హాజరయ్యారో, అది ఆయనకు రాజకీయంగా ఎంతవరకు పనికొస్తుందో ఆయనకే తెలియలన్నారు. పోగాలం దాపురించటంతోనే తన కుమారుడితో కలిసి చంద్రబాబు ఆ టాక్ షోలో హాజరయ్యారన్నారు.

‘మూడు గంటలు కాళ్ళు పట్టుకుని బతిమాలినా ఒప్పుకోలేదు.. అందుకే జుట్టు పట్టుకుని లాగేశాను’ అనే విధంగా చంద్రబాబు మాట్లాడటం చాలా ఘోరమని అంబటి రాంబాబు అన్నారు. ఈ చర్చ ద్వారా వెన్నుపోటు ఎలా జరిగిందో ఈ తరం వాళ్ళకు తెలిసేలా ‘ఆహా’ వాళ్లు చేశారన్నారు. బాలకృష్ణ తానా అంటే తందానా అంటున్నాడని ఎద్దేవా చేశారు. వైస్రాయ్ హోటల్ దగ్గర ఎన్టీఆర్‌పై చెప్పులు వేయటం సమంజసమేనని బాలయ్య చెప్పడం దౌర్భాగ్యమన్నారు. ఎన్టీఆర్ మరణించి ఉండకపోతే మీ బతుకు ఏమై ఉండేదని ప్రశ్నించారు. మీ స్నేహితుడు ఎవరని అడిగితే.. రాజశేఖరరెడ్డి, తాను కలిసి తిరిగే వాళ్లమని చంద్రబాబు చెప్పారన్నారు. మరి.. రాజశేఖరరెడ్డి వెంట తిరుగుతూ ఖర్చుల కోసం చంద్రబాబు డబ్బులు తీసుకునేవాడని, ఆ విషయాన్ని చంద్రబాబు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. రాజశేఖరరెడ్డి కుటుంబం అప్పటికే ధనవంతులని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి లక్ష్మీ పార్వతి సహా నాదెండ్ల భాస్కర్‌ని కూడా పిలిచి ఉంటే బాగుండేదని అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ పతనం అన్‌స్టాపబుల్ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు వైసీపీ సాధించటం అన్‌స్టాపబుల్ అని జోస్యం చెప్పారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు అసెంబ్లీకి హాజరుకాడు కానీ బాలయ్య టాక్ షోకి హాజరవుతాడని విమర్శించారు. ఈ స్థాయికి దిగజారిన తర్వాత ఏం మాట్లాడతామని నిలదీశారు. లక్ష్మి పార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడంలో లాజిక్ ఉందన్నారు. ఇంత మంది పిల్లలున్నా.. ఒక్కరైనా ఎన్టీఆర్‌కు కనీసం మంచి నీళ్ళు అయినా ఇచ్చారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Exit mobile version