ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ్టికి పన్నెండవ రోజు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చేరింది. రైతులు తలపెట్టిన పాదయాత్రకు ఒంగోలు నగరంలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అమరావతి రైతులకు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్, జనసేన,సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు.
ఆనాడు అమరావతిని శాశ్వత రాజధానిగా ఉంచుతామనే హామీవల్లే తమ విలువైన భూములు ఇచ్చామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులు అనటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి నిదర్శనమని వారు మండిపడ్డారు.
ఆంధ్ర రాష్ట్రం విడిపోయి రోడ్డున పడ్డ ప్రజానీకానికి అమరావతి రైతుల విలువైన భూములు ఇచ్చి ఆదుకున్నారని అమరావతి రైతులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన లో నేడు అమరావతి రైతులు రోడ్డున పడ్డారని విమర్శించారు. ఈ సందర్భంగా రైతులు తలపెట్టిన పాదయాత్ర కర్నూలు రోడ్డు నుండి అద్దంకి బస్టాండ్ ,మార్కెట్, కొత్త పట్నం బస్ స్టాండ్ ,బచ్చల బాలయ్య కల్యాణ మండపం వరకు పాదయాత్ర సాగింది. పోలీసులు అడుగడుగునా పర్యవేక్షించారు.