Site icon NTV Telugu

Amaravati Farmers: ఢిల్లీ వెళ్లిన అమరావతి రైతులు.. జంతర్ మంతర్ వద్ద నిరసన

Amaravati Farmers

Amaravati Farmers

Amaravati Farmers Going To Delhi For AP Capital Issue: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే నినాదాన్ని ఎలుగెత్తి చాటేందుకు అమరావతి రైతులు ఢిల్లీకి వెళ్లారు. విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన వీళ్లు.. డిసెంబర్ 17, 18వ తేదీల్లో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టనున్నారు. మొత్తం 1580 మంది రైతులు ఈ నిరసన దీక్షలో పాల్గొననున్నారు. అంతేకాదు.. మూడు రోజుల పాటు అక్కడ వివిధ కార్యక్రమాలు చేపట్టి, అమరావతి ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేలా ప్రణాళికలు రూపొందించారు. సీఎం జగన్ మూడు రాజధానుల్ని ప్రకటించి డిసెంబర్ 17వ తేదీ నాటికి మూడేళ్లు అవుతున్న తరుణంలో.. అమరావతి రైతులు ఈ ఢిల్లీ యాత్ర చేపట్టారు. ఈ నెల 21వ తేదీన రైతులు తిరిగి విజయవాడకు చేరుకోనున్నారు.

కాగా.. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ, రాజధాని రైతులు వెయ్యి రోజులుగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే! రాజధాని గ్రామాల్లో రిలే దీక్షలు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పాదయాత్ర, అమరావతి నుంచి అరసవల్లి వరకు మహాపాదయాత్ర వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఈ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు.. తమ గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించాలని పయనమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో బయలుదేరిన ఈ రైతులు.. శుక్రవారం రాత్రికి ఢిల్లీ చేరుకుంటారు. ఈ ఢిల్లీ యాత్రకు అన్ని రాజకీయపార్టీలు, ప్రజా రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

అటు.. ఢిల్లీ చేరుకున్న తర్వాత రైతులు 17న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టనున్నారు. 18న ఐకాస నేతలు, రైతులు బృందాలుగా విడిపోయి.. జాతీయపార్టీల అధినేతలు, ఎంపీలను కలిసి.. అమరావతి ఆవశ్యకతతోపాటు తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని రైతులు పేర్కొన్నారు.

Exit mobile version