NTV Telugu Site icon

YS Jagan: బాలినేని ఎఫెక్ట్‌..! ప్రకాశం జిల్లా నేతలతో జగన్‌ భేటీ..

Jagan

Jagan

YS Jagan: ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్‌ నేత, మాజీ మంత్రి, వైఎస్‌ జగన్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం చర్చగా మారింది.. ఇదే సమయంలో.. ఆయన జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవడం.. త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్టు కూడా ప్రకటించారు.. అయితే, బాలినేని వెంట మరికొందరు వైసీపీ నేతలు, పార్టీ శ్రేణులు కూడా వెళ్తున్నారనే ప్రచారం సాగుతోంది.. ఈ నేపథ్యంలో అలర్ట్‌ అయ్యారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇవాళ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రకాశం జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.. పార్టీ నిర్మాణాత్మక విషయాలపై చర్చించే అవకాశం ఉంది అంటున్నారు.. జిల్లా అధ్యక్షుడిని నియమించడంతో పాటు పలు నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్పులు చేయవచ్చనే ప్రచారం సాగుతోంది..

Read Also: CM Chandrababu: శ్రీకాకుళం పర్యటన రద్దు.. ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన ఖరారు..

మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో నష్ట నివారణ చర్యలపై దృష్టి పెట్టారు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌.. బాలినేని వెంట ముఖ్య నేతలు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నారు.. కాగా, బుధవారం రోజు వైసీపీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. శుక్రవారం రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో దాదాపు గంటకు పైగా చర్చలు జరిపారు.. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు. ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు.. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు. వైఎస్ మీద ప్రేమతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వైసీపీలోనే ఉన్నానని.. గతంలోనే పవన్.. వైసీపీలో బాలినేని లాంటి మంచి వ్యక్తులు ఉన్నారని చెప్పారు. ఎన్నికల ముందు కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జనసేనలో చేరలేకపోయానని బాలినేని అన్నారు. ఏ డిమాండ్స్ లేకుండానే జనసేన పార్టీలో చేరుతున్నా.. కూటమి నేతలతో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తనను పార్టీలోకి ఆహ్వానించిన డిప్యూటీ సీఎం పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఇక, ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌పై బాలినేని చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారిపోయిన విషయం విదితమే..