YS Jagan: ముద్రగడకు జగన్ భావోద్వేగ నివాళి.. ‘పితృసమాన నేతను కోల్పోయాం’

Mudragada

Mudragada

YS Jagan: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన జగన్, ముద్రగడ తనకు పితృసమానులని పేర్కొంటూ ఆయన మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ముద్రగడ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందన్న సమాచారం తమకు ఆశ కలిగించిందని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజల మధ్యకు వస్తారని భావించిన సమయంలో ఆయన శాశ్వతంగా దూరం కావడం ఎంతో బాధాకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ముద్రగడ పద్మనాభం దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందించారని జగన్ కొనియాడారు. విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన ముద్రగడ పదవుల కంటే ప్రజల సేవకే ప్రాధాన్యం ఇచ్చారని, పేదల అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పెద్దదిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు.

ముద్రగడ పద్మనాభం నిజాయితీ, ఆత్మగౌరవం, నిబద్ధతకు ప్రతీక అని పేర్కొన్న వైఎస్‌ జగన్, ఆయన మరణం కుటుంబానికే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ముద్రగడ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించారు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి..